Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు ఏజే.రమేష్
- సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం
నవతెలంగాణ-భద్రాచలం
పోలవరం ముంపుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టతనివ్వాలని, పోలవరం ప్రాజెక్టు కాపర్ డ్యాం నిర్మాణం పూర్తయిన నేపథ్యంలో భద్రాచలంపై ముంపు అధికారులు స్పందించాలని, భద్రాచలంకి ముప్పు లేకుండా శాశ్వత పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని డిమాండ్ చేస్తూ సీపీఐ(ఎం) పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ప్లకార్డులు పట్టుకుని నిరసన కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి అధ్యక్షతన జరిగిన సభలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు ఏ.జె.రమేష్ మాట్లాడుతూ ప్రభుత్వం కడుతున్న పోలవరం ప్రాజెక్ట్, కాపర్ డ్యాం నిర్మాణం వల్ల భద్రాచలం భవిష్యత్ పట్ల ప్రభుత్వం తన వైఖరిని తెలియజేయాలన్నారు. భద్రాచలం మునకకి గురి కాకుండా 2000 సంవత్సరంలో నిర్మాణం చేసిన కరకట్టని నెల్లిపాక వరకు పొడిగించాలని పేర్కొన్నారు. కరకట్ట స్లూయిజ్ లీకుల ద్వారా వచ్చే నీటిని మోటార్లు పెట్టీ తొడటం వల్ల కొత్త కాలని, అశోక నగర్ కాలనీ, ఏయంసీ కాలనీ, విస్టా కాంప్లెక్స్ మునక నుండి కాపాడగలమన్నారు. 2019 ఏప్రిల్‌లో సాగునీటి రంగ నిపుణులతో వేసిన కమిటీ ఈ ప్రాంతమంతా పర్యటించి రాష్ట్ర ప్రభుత్వానికి ముంపు పై ఒక నివేదిక ఇచ్చిందని, ఆ నివేదికని బహిర్గతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. భద్రాచలం పట్ల ఏడు సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శించిందన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి భద్రాచలం భవిష్యత్‌పై తగిన ప్రణాళికని రూపొందించాలన్నారు. లేని పక్షంలో అన్ని రాజకీయ పార్టీలను, సంస్థలను కలుపుకుని విశాల ఉద్యమాన్ని నిర్మిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు మర్ల పాటి రేణుక, యం. బి.నర్సారెడ్డి, పార్టీ పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు భీమ వరపు వెంకటరెడ్డి, బండారు శరత్ బాబు, పట్టణ కమిటీ సభ్యులు పి.సంతోష్ కుమార్, ఎన్. నాగరాజు, డి.సీతాలక్ష్మి, యు.జ్యోతి, ఎస్.రామకృష్ణ, పార్టీ పట్టణ కమిటీ సభ్యులు ఎస్ డి ఫిరోజ్, ఎన్.వి.ఎస్ నారాయణ, డీవైఎఫ్ఐ సతీష్, లక్ష్మణ్, ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.