Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- కామేపల్లి
రెవెన్యూ, ఫారెస్టు అధికారుల సమన్వయ లోపంతో రైతులను ఇబ్బందులకు గురి చేయవద్దని ఎమ్మేల్యే బాణోత్ హరిప్రీయా అన్నారు. జాస్తీపల్లి, మద్దులపల్లి, కెప్టెన్ బంజర గ్రామాల్లో గిరిజన, గిరిజనేతర రైతులు సాగుచేసుకుంటున్న భూములపై ఫారెస్ట్ అధికారులు వేధింపులకు గురి చేస్తున్నారనే సమాచారం తెలుసుకున్న ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యురాలు బానోత్ హరిప్రియ మంగళవారం మద్దులపల్లి ఏరియాలో రైతుల భూమి వద్దకు చేరుకొని సమస్యను అడిగి తెలుసుకున్నారు. జిల్లా ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరిం చడానికి తన వంతు కృషి చేస్తానని రైతులకు హామీ ఇచ్చారు. అప్పటి వరకు ఫారెస్ట్ అధికారులు, రెవెన్యూ అధికారులు రైతులకు జోలికి వెళ్లవద్దని సూచించారు.
ఫారెస్ట్ అధికారుల వేధింపులు వెంటనే ఆపాలని : నున్నా
రైతులపై ఫారెస్ట్ అధికారుల వేధింపులు వెంటనే ఆపాలని, వేధింపులు ఆపకపోతే తగిన గుణపాఠం చెప్పడం ఖాయమని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నాగేశ్వరరావు హెచ్ఛరించారు. మద్దులపల్లి, జాస్తి పల్లి, ముచ్చర్ల, కెప్టెన్ బంజార గ్రామాలకు చెందిన రైతుల భూములపైకి ఫారెస్టు అధికారులు వెళ్లి భయబ్రాంతులకు గురి చేయడం సరైంది కాదని ఆయన అన్నారు. ఎంఎల్ఏ హరిప్రియతో కలిసి ఆయన భూములను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1952 సంవత్సరం నుండి పహానిలో కొనసాగుతూ పట్టాదారు పాసు బుక్ వచ్చినప్పటికీ రైతులని ఇబ్బందులు పెడుతున్నారన్నారు. ఫారెస్ట్ అధికారులు, తహశీల్దార్ అందరి సమక్షంలో రైతులకి ఉన్న ఆధారాలు పరిశీలించి ఆ భూముల జోలికి ఫారెస్ట్ అధికారులు రావద్దు అని అధికారులను హెచ్చరించారు. లేనియెడల ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చ రించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు దుగ్గి కృష్ణ, టిఆర్ఎస్ మండల అధ్యక్షులు అంతోటి అచ్చయ్య, సీపీఎం మండల కార్యదర్శి అంబటి శ్రీనివాస్ రెడ్డి, సామ మోహన్‌రెడ్డి, కట్రాల రాంబాబు, మల్లెంపటి శ్రీనివాస్‌రావు తదితరులు పాల్గొన్నారు.