Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎకరంలోపు రైతులు 1.34 లక్షలు
- వారికందే రైతుబంధు సాయం కేవలం రూ.54.14 కోట్లు
- మొత్తం రైతులు 4,49,527...పెట్టుబడి సాయం రూ.575 కోట్లు
నవతెలంగాణ - ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఖరీఫ్ వ్యవసాయ సీజన్‌కు సంబంధించి ఎకరానికి రూ.5,000 చొప్పున ఇచ్చే రైతుబంధు సాయం రైతుల ఖాతాల్లో జమవుతోంది. ఈనెల 15 నుంచి మొదలైన ఈ ప్రక్రియ ఈనెలాఖరు వరకు కొనసాగనుంది. ఎకరం అంతకన్నా లోపున్న రైతులకు మంగళవారం పెట్టుబడి సాయం బ్యాంకు ఖాతాలో పడింది. ఇలా చివరి భూమి వరకు పంట సాయం పంపిణీ చేస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 63.25 లక్షల మంది రైతులుండగా కోటిన్నర ఎకరాల భూమి ఉంది. వీటికి రూ.7,500 కోట్లు పెట్టుబడి సాయం కింద పంపిణీ చేయనున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా... ఎకరం, రెండు, మూడు ఎకరాలలోపు భూమి ఉన్న సన్నచిన్నకారు రైతులే రాష్ట్రవ్యాప్తంగా అత్యధికంగా ఉన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనూ ఈ తరహా రైతులే ఎక్కువగా ఉన్నారు. మంగళవారం ఎకరం అంతకులోపున్న రైతులకు పెట్టుబడి సాయం జమచేయగా...రెండు ఎకరాలలోపు ఉన్న రైతులకు బుధవారం జమయ్యేలా ట్రెజరీకి సంబంధిత నిధులను ప్రభుత్వం బదిలీ చేసింది.
- మూడొంతుల రైతులకు పదిశాతమే పెట్టుబడి సాయం
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అత్యధికంగా ఉన్న ఎకరం అంతకన్నాలోపు రైతులకు అందే పెట్టుబడి సాయం పదిశాతం మాత్రమే కావడం గమనార్హం. దీన్నిబట్టి సన్నచిన్నకారు రైతులకంటే ధనిక రైతులకే రైతుబంధు ద్వారా ఎక్కువ ప్రయోజనం సమకూరుతుందని అర్థమవుతుంది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 4,49,527 మంది రైతులుండగా వారికి పెట్టుబడి సాయం రూ.575 కోట్లు అందనుంది. వీరిలో ఎకరం అంతకు లోపు భూమి ఉన్న రైతులు 1.34 లక్షల మంది ఉండగా వారికందే రైతుబంధు సాయం కేవలం రూ.54.14 కోట్లు మాత్రమే. రైతుబంధు సాయంలో అత్యధికంగా ఉన్న ఎకరంలోపు రైతులకు అందే పెట్టుబడి సాయం నూటికి పదిశాతం మాత్రమే కావడం గమనార్హం. దీన్నిబట్టి రైతుబంధు ధనిక రైతులకు వరమనే విమర్శలు వస్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 1,40,443 మంది మొత్తం రైతులుండగా రూ.213.51 కోట్లు వానాకాలం పెట్టుబడి సాయం కింద అందుతోంది. వీరిలో ఒక ఎకరం అంతకులోపు ఉన్న రైతులు 30,279 మంది కాగా వీరికి అందే సాయం కేవలం రూ.20.52 కోట్లు మాత్రమే. 42 శాతానికి పైగా ఉన్న రైతులకు అందే సాయం మొత్తంలో కేవలం 10.40శాతం మాత్రమే కావడం గమనార్హం.
భూమి ఎకరాలలో.. రైతులు పెట్టుబడిసాయం (రూ.కోట్లలో)
ఎకరంలోపు 1,03,942 33.62
1నుంచి 2 79,288 60.35
2 నుంచి 3 45,950 57.65
3 నుంచి 4 27,453 48.19
4 నుంచి 5 18,972 42.91
5 నుంచి 6 9,255 25.37
6 నుంచి 10 14,013 53.14
10 ఎకరాలకు పైన 5,639 41.48
మొత్తం 3,04,512 362.69
.....................................................................
ఈ పట్టికను బట్టి చూస్తే ఖమ్మం జిల్లాలో అత్యధికంగా ఉన్న ఎకరం అంతకులోపు రైతులకు అందే పెట్టుబడి సాయం నామమాత్రమేనని అర్థమవుతుంది. జిల్లాలో గతేడాది యాసంగి కంటే ఈ వానాకాలానికి 5,000 మందికి పైగా రైతులు పెరిగారు. కానీ పెట్టుబడి సాయం మాత్రం కొంత తగ్గింది. 31శాతం మంది రైతులకు పెట్టుబడి సాయంలో 11శాతం మాత్రమే అందుతుండటం గమనార్హం.