Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శ్రీశ్రీ వర్థంతి సభలో సుద్దాల, కొరటాల, లెనిన్, మువ్వా తదితరులు
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
''ఆకాశం బద్దలైనట్లు, భూమి కంపించినట్లు ఉబికి వస్తున్న అగ్నిపర్వతం లోని లావాలా.. ప్రళయ గర్జన చేస్తూ తెలుగు సాహిత్యంలో ఒక మహౌజ్వల చరిత్రను సృష్టించారు శ్రీ శ్రీ'' అని ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ అన్నారు. ఆయనను చిన్నతనంలో తమ ఊరి రైల్వేస్టేషన్ లో కలిసానని, ఆయన చేతి స్పర్శ తనకు ఇంకా నిత్య నూతనమై చైతన్య పరుస్తూ ఉందన్నారు. జాషువా సాహిత్య వేదిక ఆధ్వర్యంలో జూమ్ వేదికగా మంగళవారం ఏర్పాటు చేసిన శ్రీశ్రీ వర్థంతి సభకు ముఖ్య అతిథిగా హాజరై అశోక్ తేజ మాట్లాడారు. ఆ మహాకవి స్ఫూర్తితో తాను రాసిన ఠాగూర్ చిత్రంలోని ''నేను సైతం ప్రపంచాగ్నికి పాట'' తన జీవితంలో గొప్ప మైలురాయి అని పేర్కొన్నారు. ఆ మహాకవి ఉనికి కార్మిక కర్షక లోకం శ్రమైక జీవన సౌందర్యాన్ని ఆస్వాదించినంత కాలం ఉంటుందని తెలిపారు. తాను సినీ రంగంలో అడుగుపెట్టి తన సినిమా ద్వారా యువతకు ఏదైనా ఒక సందేశం ఇవ్వటానికి చేసే ప్రయత్నం వెనుక కచ్చితంగా శ్రీశ్రీ కవిత్వపు ప్రభావం ఉందని మరో అతిథి, ప్రముఖ సినీ దర్శకుడు కొరటాల శివ స్పష్టం చేశారు. మహాప్రస్థానం, మరో ప్రపంచం, భిక్షువర్షీయసి, మానవుడా వంటి కవితా ఖండికలు మనస్సును నిరంతరం ప్రశ్నించే శతఘ్నులన్నారు. తనను ఎప్పటికీ కుదురుగా ఉండనివ్వని బడబాగ్నులన్నారు. యువశక్తిని అమితంగా ప్రేరేపించిన కవులలో శ్రీశ్రీ అగ్రగణ్యుడని ప్రశంసించారు. సభకు అధ్యక్షత వహించిన ప్రముఖ కవి లెనిన్ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రపంచ శ్రామిక లోకపు ఆత్మ శ్రీశ్రీ అన్నారు. ఆయన వేసిన బాట తదనంతర తెలుగు సాహిత్య పరిణామాలను సమూలంగా మార్చివేసిందన గగన నారు. ఇటువంటి కార్యక్రమాలు నిరంతరం నిర్వహిస్తూ ఆ మహనీయుని సజీవంగా నిలుపుకోవడం గొప్ప విషయమన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీశ్రీ కవితా ఖండికలను తెలుగు రాష్ట్రాలలో లబ్ధప్రతిష్టులైన గాయకులు శేషగిరి, కన్నెగంటి, రౌతురవి, సదానంద్, యోచన, వీరభద్రం, జిగీష తదితరులు అద్భుతంగా ఆలపించి అలరించారు. జాషువా సాహిత్య వేదిక అధ్యక్ష కార్యదర్శులు ప్రముఖ కవి మువ్వా శ్రీనివాసరావు, రచయిత పగిడిపల్లి వెంకటేశ్వర్లు తెలుగు సాహిత్య చరిత్రలో చిరస్మరణీయులైన సాహితీ దిగ్గజాలు కార్యక్రమాలను నిర్వహించటం తమకు మహదానందమన్నారు. ప్రత్యేక అతిథులుగా అరుణోదయ నాగన్న, వెంకటేశ్వర్లు,గోరటి రమేష్, ఈ కార్యక్రమంలో కవులు అట్లూరి వెంకటరమణ, ఆనందాచారి, సీతారాం, ప్రసేన్, సునంద, నామా పురుషోత్తం, దాసోజు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.