Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెచ్చిపోతున్న నకిలీ వ్యాపారులు
- రైతులకు కోట్ల రూపాయల ఎగనామం
- తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు బొంతు రాంబాబు
నవతెలంగాణ-వైరా టౌన్
ఖమ్మం మిర్చి మార్కెట్ అడ్డాగా నకిలీ వ్యాపారుల తోపాటు కొందరు లైసెన్స్ వ్యాపారులు పధకం ప్రకారం రైతులు నుంచి కోట్ల రూపాయల విలువైన మిర్చి కొనుగోలు చేసి రైతులకు డబ్బు చెల్లించకుండా రాజకీయ ప్రతినిధులు, అధికారులు, వ్యాపారసంఘాల అండతో జోరుగా అక్రమదందాను సాగిస్తున్నారని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు బొంతు రాంబాబు అన్నారు. బుధవారం వైరా బోడేపూడి వెంకటేశ్వరరావు భవనంలో జరిగిన రైతు సమావేశంలో బొంతు రాంబాబు మాట్లాడుతూ మిర్చి కొనుగోలు చేసి రైతులకు డబ్బు చెల్లించకుండా అక్రమదందా కొనసాగిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కొందరు తెలివిగా రైతులను నమ్మించి మిర్చి కొనుగోలు చేసి రైతులకు డబ్బు చెల్లించకుండా వ్యాపారంలో నష్టం వాటిల్లిందని కోర్టులను ఆశ్రయించి దివాలా పిటీషన్ దాఖలు చేసి రైతులకు కోట్ల రూపాయల ఎగనామం పెట్టారని, ఖమ్మం మిర్చి మార్కెట్ కేంద్రంగా ఏన్కూర్, తల్లాడ ఉపకేంద్రాలగా చేసుకుని రైతులకు అధిక ధర వస్తుందని నమ్మబలికి రైతులు నుంచి మిర్చి కొనుగోలు చేసి రైతులకు డబ్బు చెల్లించకుండా బోర్డు తిప్పి వేస్తున్నారని అన్నారు. గత మూడు నెలలుగా వందలాదిమంది రైతులు, అందులో 90 శాతం గిరిజన రైతులు మిర్చి అమ్ముకొని డబ్బు చేతికి రాకా కాళ్ళ చెప్పులు అరిగే లాగా అధికారులు చుట్టూ తిరుగుతూ అలసి పోయారని అన్నారు. జిల్లా మంత్రి పువ్వాడ అజరు కుమార్ ను కొత్తగూడెం జిల్లా కేంద్రం పర్యటన సందర్భంగా రైతులు కలిసి తమకు జరిగిన అన్యాయం గురించి వివరించే ప్రయత్నం చేసినా అధికారులు అవకాశం ఇవ్వలేదని అన్నారు. కొందరు రాజకీయ ప్రతినిధులు అక్రమ దందా కొనసాగిస్తున్న వ్యాపారులకు అండగా ఉంటున్నారని, ఖమ్మం మిర్చి మార్కెట్, ఏన్కూర్, తల్లాడ, కారేపల్లి, జూలూరుపాడు మండలలో రైతుల నుంచి మిర్చి కొనుగోలు చేసి రైతులకు డబ్బు చెల్లించకుండా ఉన్న వ్యాపారి వద్ద ఖమ్మం మార్కెట్టులో అధికార పార్టీ నాయకుడుగా చెలామని అవుతున్న ఓ వ్యక్తి రెండు వేల గజాల స్థలాన్ని ఎగ్రిమెంట్ చేసుకుని కూడా రైతులకు డబ్బు చెల్లించకుండా మిర్చి వ్యాపారిచే కోర్టులో దివాలా పిటీషన్ దాఖలు చేసే ప్రయత్నం చేయించడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా నాయకులు చింతనిప్పు చలపతిరావు, సిఐటియు జిల్లా నాయకులు సుంకర సుధాకర్, తోట నాగేశ్వరావు, గోపవరం సోసైటి డైరెక్టర్ సంక్రాంతి నర్సయ్య, రామకృష్ణ, మిర్చి రైతులు పాల్గొన్నారు.