Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండు నెలలుగా సేవా కార్యక్రమాలు
నవతెలంగాణ- బోనకల్
సీపీఎం, డివైఎఫ్ఐ నాయకులు కరోనా బాధితులకు సేవలందిస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. మండల పరిధిలోని తూటికుంట్ల గ్రామంలో సిపిఎం, డివైఎఫ్ఐ నాయకులు రెండు నెలలుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తూటికుంట్ల గ్రామంలో 55 మందికి కరోనా సోకింది. ఏప్రిల్ నెల నుంచి గ్రామంలో కరోనా కేసులు నమోదు ప్రారంభమయ్యాయి. కరోనా కేసులు నమోదు ప్రారంభం నుంచే సిపిఎం, డివైఎఫ్ఐ నాయకులు, కార్యకర్తలు కరోనా బాధితులను ఆదుకునేందుకు నడుంబిగించారు. ప్రాథమిక సమాచారం బట్టి దాదాపు జిల్లాలో ఏ గ్రామంలోనూ చేయని విధంగా కరోనా బాధితులకు సిపిఎం, డివైఎఫ్ఐ గ్రామ కమిటీలు సేవా కార్యక్రమాలు నిర్వహించాయి. కరోనా సోకిన బాధితుల ఇళ్లకు స్వయంగా వెళ్లి సేవలు అందించటం కత్తి మీద సాము లాంటిదే అయినా భయపడకుండా వారు కరోనా బాధితులకు సేవలు అందించారు. మూడు రోజులకు ఒకసారి కరోనా బాధితులకు అందించే పౌష్టికాహారాన్ని మార్పులు చేసుకుంటూ పంపిణీ చేశారు. కరోనా బాధితులకు మొదటిరోజు కోడిగుడ్లు, కూరగాయలు, శానిటైజర్లు, మాస్కులు, రాగి పిండి పంపిణీ చేశారు. రెండవ రోజు క్యారెట్లు, బీట్ రూట్, నిమ్మకాయలు, యాపిల్ కాయలు, అరటికాయలు, బత్తాయిలు, దానిమ్మ కాయలు, ఆకుకూరలు పంపిణీ చేశారు. మూడవరోజు కోడి మాంసం పంపిణీ చేశారు. ఈ విధంగా మూడు రోజులకు ఒకసారి పంపిణీలో మార్పులు చేస్తూ కరోనా బాధితులకు రెండు నెలలపాటు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. తూటికుంట్ల లో ఖర్చుకు వెనకాడకుండా కరోనా బాధితులకు అండగా ఉంటూ మనోధైర్యం కల్పిస్తూ అవసరం అయిన వారిని ఆసుపత్రులకు తరలిస్తూ సేవా కార్యక్రమాలు నిర్వహించడం పట్ల గ్రామస్థుల నుంచి అభినందనలు వ్యక్తమవుతున్నాయి. మండలంలో 14 గ్రామాలలో కరోనా మృతులు నమోదు కాగా తూటికుంట్లలో మాత్రం ఒక్క కరోనా మతి కూడా నమోదు కాలేదు. కరోనా బాధితులకు పౌష్టికాహారం అందించడమే కాక వైద్య చికిత్స అందించటంలోనూ మంచి కృషి చేశారు. ఒక రకంగా చెప్పాలంటే కరోనా బాధితులకు పౌష్టిక ఆహారాన్ని అందించటంలో శక్తికి మించి ఆర్థిక భారాన్ని భరిస్తూ కరోనా బాధితుల కోసం నిత్యం అండగా ఉన్నారు. అవసరమైన సందర్భాలలో గ్రామపంచాయతీ సర్పంచ్ నోముల వెంకట నరసమ్మ ఎంపీపీ కంకణాల సౌభాగ్యం సహాయ సహకారాలు తీసుకుంటూ సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సేవా కార్యక్రమాల్లో ఎంపీపీ కంకణాల సౌభాగ్యం సిపిఎం మండల కమిటీ సభ్యులు తుళ్లూరు రమేష్, నోముల పుల్లయ్య , సిపిఎం శాఖా కార్యదర్శులు పాపినేని అప్పారావు, పాపినేని రమేష్, పాపినేని వెంకట్రావు, సిపిఎం మధిర మాజీ పట్టణ కార్యదర్శి పాపినేని రామ నరసయ్య, డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు గుమ్మ ముత్తారావు, సిపిఎం గ్రామ శాఖల పార్టీ సభ్యులు, సానుభూతిపరులు, డివైఎఫ్ఐ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యల పాల్గొన్నారు.