Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అసైన్డ్ భూమిని స్వాహా
చేసేందుకు ప్రయత్నం
- అధికార పార్టీ నాయకులే సూత్రధారులు
- అసైన్డ్‌భూమిని పరిశీలించిన తహశీల్దార్...కలెక్టర్‌కు నివేదిక
- భూమిని స్వాధీనం చేసుకొని పేదలకు పంచాలి : సీపీఐ(ఎం)
నవతెలంగాణ-ఖమ్మంరూరల్
ఖమ్మం నగరానికి కూత వేట దూరంలో బైపాస్కు ఆనుకుని పక్కనే ఉన్న 12 కోట్ల విలువ చేసే మూడు ఎకరాల ప్రభుత్వం భూమిని గద్దల్లా తన్నుకపోయేందుకు సిద్ధమయ్యారు అధికార పార్టీ నేతలు...అసైన్డ్ భూమిని చదును చేసి ప్లాట్లుగా విక్రయిం చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. పన్నెండు కోట్ల విలువ చేసే భూమికి ఎసరు పెట్టారు.
పెద్దతండా పంచాయతీ పరిధిలో గల నాయుడుపేటకు చెందిన యమా కృష్ణమూర్తికి 1964 లో అప్పటి ప్రభుత్వం సాగు చేసుకునేందుకు ఏదులాపురం రెవిన్యూ పరిధిలోని సర్వే నంబర్ 142లో మూడు ఎకరాల భూమికి అసైన్డ్ పట్టా ఇచ్చింది.ఆ భూమిని కృష్ణమూర్తి సేద్యం చేయకుండా కాలం గడిపాడు. సంబంధిత పట్టాదారు ఇటీవలే మరణించాడు. అ భూమిని 2017 లో ఓ వ్యక్తి కొని మరో వ్యక్తికి విక్రయించాడు. అ భూమి ఇప్పటికే అగ్రిమెంట్ రూపంలో ముగ్గురి చేతులు మారినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సదరు వ్యక్తులు అ భూమిని ఎకరం నాలుగు కోట్లకు పైగా చెబుతున్నారంటే భూమికి ఎంత విలువ ఉందో అర్థం చేసుకోవచ్చు. బైపాస్ రోడ్డుకు పక్కనే ఉన్న ఇట్టి విలువైన భూమిని ప్లాట్లు చేసి విక్రయించేందుకు సిద్ధమవుతున్నారు. నాయడు పేట గ్రామానికి చెందిన అధికార పార్టీ నాయకులు తమకు అన్ని పేపర్లు ఉన్నాయని, కన్వర్షన్ కూడా వచ్చిందని బాహాటంగానే చెపుతున్నారు.
ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు: తహసీల్దార్ శ్రీనివాస్‌రావు
ప్రభుత్వ భూములను ఎవరైనా ఆక్రమిస్తే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు ఉంటాయని తహసీల్దారు కారుమంచి శ్రీనివాస రావుహెచ్చరించారు. పెద్దతండా పంచాయతీ నాయుడుపేట పరిధిలోని బైపాస్‌రోడ్ వద్ద గల సర్వేనంబర్ 142 లోని అసైన్డ్‌మెంట్ భూమిని కొంత మంది అక్రమించి ప్లాట్లు చేస్తున్నారనే ఆరోపణలు రావడంతో గురువారం ఆ భూమిని తహసీల్దారు సందర్శించారు. భూమి హద్దులను, రికార్డులను పరిశీలించారు. అసైన్డ్ భూమిని అమ్మడానికి, కొనడానికి వీలు లేదన్నారు. అమ్మినా, కొనుగోలు చేసినా నేరం అవుతుంద న్నారు. దీనిపై కలెక్టర్‌కు నివేదికను అందజేసి చట్ట ప్రకారం బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తహసీల్దారు వివరించారు. కార్యక్రమంలో అర్ఐ నరేశ్, సర్వేయర్ వెంకట్, సిబ్బంది పాల్గొన్నారు.
భూమిని స్వాధీనం చేసుకొని పేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలి : సీపీఐ(ఎం)
నాయుడు పేట గ్రామంలో సుమారు 300 మంది పేదవాళ్ళు ఉన్నారు.ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని గ్రామంలోని పేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలి అని సీపీఐ(ఎం) నాయకులు నందిగామ కృష్ణ అన్నారు. అ భూమిని ఎవరైనా ఆక్రమిస్తే సీపీఎం ఆధ్వర్యంలో నిరాహార దీక్షకు దిగుతామని హెచ్చరించారు.