Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వారంలో రేషన్ కార్డుల జాబితా పంపాలి..
- కలెక్టర్లతో వీసీలో పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
రేషన్ కార్డు దరఖాస్తుల అర్హులను త్వరగా గుర్తించాలని రాష్ట్ర బి.సి సంక్షేమం, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ సూచించారు. రబీ ధాన్యం సేకరణ, రేషన్ కార్డుల జారీపై శుక్రవారం కరీంనగర్ నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రేషన్ కార్డుల జారీపై రాష్ట్ర క్యాబినెట్ సబ్ కమిటీ సూచించిన విధంగా పెండింగులో ఉన్న 4,15,901 దరఖాస్తులను పరిశీలించి, వారంలో జాబితాను పంపాలని మంత్రి ఆదేశించారు. కిరాయి ఇండ్లలో ఉండి రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకొని వేరక చోటికి మారిన వారిని గుర్తించి ఉన్నచోటు నుండి రేషన్ కార్డును మంజూరు చేయుటకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. అత్యధికంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో ప్రత్యేక శ్రద్ధతో వెరిఫికేషన్ చేయించాలన్నారు. రాష్ట్రంలోని రేషన్ కార్డులకు త్వరలోనే స్మార్ట్ కార్డులను జారీచేసేందుకు పరిశీలిస్తున్నామన్నారు. రాష్ట్రంలో 1,454 చౌక ధరల దుకాణ డీలర్లు ఖాళీగా ఉన్నాయని, త్వరలో వాటి భర్తీకై చర్యలు తీసుకుంటున్నామన్నారు. కొన్ని తండాలు గ్రామ పంచాయతీలుగా మారాయని, ప్రజలకు దూరంలో రేషన్ షాపులుంటే అవసరాన్ని బట్టి సబ్ సెంటర్ డీలర్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రితో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామన్నారు. రబీ సీజన్లో 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు ప్రభుత్వ లక్ష్యం కాగా ఇంతవరకు అంచనాలకు మించి 90 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యం కొనుగోలు చేశామని మంత్రి తెలిపారు. 17 వేల కోట్లకు పైగా విలువ గల ధాన్యాన్ని సేకరించామన్నారు. మూడురోజుల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమచేస్తున్నామన్నారు. దాదాపు మరో లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయవలసి ఉంటుందన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లలో ధాన్యం మిల్లింగ్ వ్యవస్థ కూడా ఏర్పాటు చేస్తామన్నారు. ధాన్యం కొనుగోళ్ళలో పాల్గొన్న జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, పౌర సరఫరాల శాఖ సిబ్బంది, రెవెన్యూ, సహకార సొసైటీలు, మహిళా సంఘాలకు, కూలీలకు, హమాలీలకు మంత్రి గంగుల కమలాకర్ ప్రత్యేకంగా అభినందించారు. కలెక్టర్ ఆర్.వి.కర్ణన్ జిల్లాలో ధాన్యం సేకరణ గురించి వివరిస్తూ 3. 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 4,411 మంది రైతుల నుండి కొనుగోలు చేశామన్నారు. ఇప్పటివరకు 27,369 మంది రైతుల ఖాతాలకు 432 కోట్ల రూపాయలను జమచేసినట్లు కలెక్టర్ వివరించారు. జిల్లాలో రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకొన్న 18,773 దరఖాస్తుల పరిశీలన పూర్తి చేసి నివేదికను సమర్పిస్తామని కలెక్టర్ వివరించారు. వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ ఎన్. మధుసూదన్, జిల్లా పౌర సరఫరా శాఖాధికారి రాజేందర్, పౌర సరఫరా జిల్లా మేనేజర్ సోములు తదితరులు పాల్గొన్నారు.