Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో రైతులపై భారం
- నిత్యావసర వస్తువుల రేట్లతో సామాన్యులు గుల్ల
- ఎకరానికి రూ.1000 వరకు పెరిగిన యంత్ర సేద్యం ఖర్చులు
- కరోనా సమయంలో ప్రజలపై ప్రభుత్వాల వడ్డన
- ధరల నియంత్రణకు నేడు లెఫ్ట్ పార్టీల సమరభేరి
పెట్రోల్ ధర సెంచరీ దాటింది. డీజిల్ రేటు రూ.100కు సమీపంలోకి వచ్చింది. ఫలితంగా ప్రజలపౖౖె పెనుభారం పడుతోంది. సేద్యం ఖర్చులు భారమై రైతులు సతమతమవుతుంటే...నిత్యావసర వస్తువుల ధరలు నింగినంటుతుండటంతో సామాన్యులు అష్టకష్టాలు పడుతున్నారు. కరోనా విపత్కర సమయంలో ప్రజలను నూనెలా పిండుతున్నారు. కేంద్ర, రాష్ట్రాలు ఇబ్బడిముబ్బడిగా పెంచుతున్న ధరలను తగ్గించాలని కోరుతూ శనివారం వామపక్షాల ఆధ్వర్యంలో ధర్నాలకు దిగుతున్నారు.
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
అంతర్జాతీయంగా పెట్రోల్, క్రూడాయిల్ ధరలు తగ్గుతున్నా పెట్రోల్, డీజిల్ ధరలు మాత్రం ఆకాశాన్నంటుతున్నాయి. ఫలితంగా నిత్యావసర వస్తువుల ధరలు దూసుకెళ్తున్నాయి. రైతుల యంత్ర సేద్యం ఖర్చులు ఎకరానికి రూ.1000 వరకూ పెరిగాయి. నిత్యావసర వస్తువుల ధరలు ముఖ్యంగా వంట నూనెలకు భారీగా రేట్లు పెరిగాయి. ఒకప్పుడు కిలో రూ.100 నుంచి రూ.150 వరకు లభించిన వివిధ రకాల నూనెలు ఇప్పుడు రూ. 150 నుంచి రూ.200కు ఎగబాకాయి. కరోనా కష్టకాలంలో మోడీ ప్రభుత్వం ప్రజలను నూనెలా పిండుతోంది. ధరల నియంత్రణ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరీకి నిరసనగా లెఫ్ట్ పార్టీల ఆధ్వర్యంలో శనివారం ధర్నాలు నిర్వహించనున్నారు.
- పెట్రోమంట...
పెట్రోల్ ధర భారీగా పెరిగింది. రూ.100కు లీటర్ కూడా రావట్లేదు. వన్ ఎంఎల్ తక్కువగానే వస్తోంది. శుక్రవారం ఖమ్మంలో లీటర్ పెట్రోల్ రూ.100.87, డీజిల్ రూ.95.69కి చేరింది. కంపెనీలను బట్టి ఈ ధరల్లో 20 నుంచి 90 పైసల వరకు వ్యత్యాసం ఉంది. ఈ రేటు జిల్లాలోని ఆంధ్ర సరిహద్దు ప్రాంతాల్లో ఒకింత ఎక్కువగానే ఉంది. ఖమ్మం జిల్లాలో 140 బంకులు ఉండగా వీటిలో రోజుకు 1.80 లక్షల లీటర్ల పెట్రోల్, 4లక్షల లీటర్ల డీజిల్ విక్రయిస్తున్నారు. భద్రాద్రి జిల్లాలోని 56 బంకుల్లో పెట్రోల్ 80వేల లీటర్లు, డీజిల్ 2.20 లక్షల లీటర్లు అమ్ముతున్నారు.
- రైతుపై పెనుభారం...
పెట్రో వడ్డనతో రైతుపై పెనుభారం పడుతోంది. దాదాపు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రైతులందరూ టూవీలర్ వినియోగిస్తున్నారు. పెట్రోల్ రేటు పెరగడంతో వారిపై విపరీతంగా భారం పడుతోంది. గతంలో ఒక లీటర్ పెట్రోల్ పోయిస్తే నాలుగైదు రోజులు వచ్చేది.. ఇప్పుడు ఒకటి రెండురోజులే వస్తుందని వాపోతున్నారు. పెట్రోల్, డీజిల్ భారంతో ఆటోలు, మినీ డీసీఎంల రవాణాచార్జీలు పెరిగాయని చెబుతున్నారు. అలాగే సేద్యానికి వినియోగించే ట్రాక్టర్లు, మందు పిచికారీ చేసే పవర్‌స్ప్రేయర్లు ఇలా అన్నింటికీ డీజిల్, పెట్రోల్‌తోనే పనికావడంతో మరింత భారం పడుతోందని వాపోతున్నారు. ఎరువుల ధరలు, వాటి రవాణాపైనా పెట్రో ధరల ప్రభావం ఉంటుందంటున్నారు. డీజిల్ రూ.60 నుంచి రూ.80వరకు అమ్ముతున్న సమయంలో ట్రాక్టర్‌తో దక్కి దున్నితే రూ.1,500 వరకు అయ్యేది. ఇప్పుడు అదే పనికి రూ.2,000 వరకు ఖర్చు వస్తుంది. పొలంలో దమ్ము చేస్తే రూ.1,800 ఉండేది ఇప్పుడు రూ.2,500 పడుతోంది. గతంలో కల్టివేటర్ వేస్తే రూ.1,500 ఉండేది ఇప్పుడు రూ.2,000 చెల్లించాల్సి వస్తోంది. గతంలో 20 నుంచి 30 కిలోమీటర్ల దూరం ఎరువుల బస్తాలు ఆటోలు, మినీ ట్రాలీలలో వేసుకు వెళ్తే బస్తాకు రూ.20 చొప్పున చార్జి వసూలు చేసేవారు. ఇప్పుడు బస్తాకు రూ.50 వసూలు చేస్తున్నారు. అలాగే పంటను మార్కెట్‌కు తరలిస్తే కూడా రవాణాచార్జీలు ఇలానే అధికంగా వసూలు చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో సుమారు పదివేలు, కొత్తగూడెం జిల్లాలో ఐదువేల వరకు వ్యవసాయ అనుమతి పొందిన ట్రాక్టర్లున్నాయి. డీజిల్ ధర పెంపుతో వీటి నిర్వహణ భారంగా మారింది.
- వంటనూనె ధర పొంగు...
ఉమ్మడి జిల్లాలో నిత్యావసర వస్తువుల ధరలు నింగినంటుతున్నాయి. వంటనూనె ధరలు భారీగా పెరిగాయి. లీటర్/కిలో రూ.60వరకు ధర పెరిగింది. గతంలో పామాయిల్ కిలో రూ.110 వరకు ఉండేది ఇప్పుడు రూ.150 పడుతోంది. పల్లీ నూనె రూ.160 ఉండేది ఇప్పుడు రూ.220 పలుకుతోంది. గతంలో రూ.140 ఉన్న పొద్దుతిరుగుడు నూనె ఇప్పుడు 170కి లభిస్తోంది. రిటైల్ విక్రయాల్లో కిలో పాకెట్‌కు రూ.10 నుంచి రూ.20 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. గృహిణులు కూరల్లో ఎంతో పొదుపుగా నూనె వాడాల్సిన పరిస్థితి వచ్చింది. టిఫిన్లకు చాలా వరకు దూరంగా ఉంటున్నారు.
- వ్యవసాయం కష్టమవుతోంది
వరప్రసాద్, రైతు, గోపాలపురం
విచ్చలవిడిగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతుండటంతో వాటి ప్రభావం పంట పెట్టుబడులపై పడుతోంది. ఇప్పుడు యంత్ర పరికరాలు వినియోగించి వ్యవసాయం చేయాలంటే డీజిల్ ధరలు వందకు చేరువ కావడంతో భయం వేస్తోంది. ట్రాక్టర్లకు బదులు ఎడ్లను వినియోగిద్దామంటే వాటిని కొనాలంటే జతకు రూ.80వేల నుంచి రూ.లక్ష వరకు వెచ్చించాల్సి వస్తుంది. వాటి పోషణ భారమవుతుంది. పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోవడం, నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో రైతులు, సామాన్యులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.
- సామాన్యులపైనే కాదు డీలర్లపైనా భారం
నాగబత్తిని రవి, పెట్రోల్ బంకుల సీనియర్ డీలర్
పెట్రోల్ ధరలు పెరగడంతో పాటు పన్ను కూడా పెంచారు. దీనివల్ల డీలర్లపై మరింత భారం పడుతోంది. నెలకు ఒక్కో బంకు రూ.2 కోట్ల విలువ చేసే పెట్రోల్, డీజిల్ తెప్పిస్తుంది. ఏడాదికి రూ.20 కోట్ల టర్నోవర్ దాటితే 1శాతం పన్ను పెంచారు. గతంలో 20వేల లీటర్ల ట్యాంకర్ రూ.6 నుంచి రూ.7 లక్షలకు వచ్చేది. ఇప్పుడు రూ.17 నుంచి 19 లక్షల వరకు కొనుగోలు చేయాల్సి వస్తుంది. కానీ కమీషన్ మాత్రం పాత పద్ధతిలోనే వస్తోంది. కరోనా నేపథ్యంలో పంపు ఆపరేటర్లకు అదనంగా చెల్లిస్తున్నాం. కరెంట్ బిల్లులు నెలకు రూ.40వేల వరకు చెల్లించాలి. కానీ చమురు సంస్థలు కమీషన్ పెంచకపోవడంతో అటు వినియోగదారులతో పాటు ఇటు డీలర్లు సైతం పెట్రోల్ ధరల పెంపుతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.
పెట్రో ధరల పెంపుతో అన్నింటిపై ప్రభావం
నున్నా నాగేశ్వరరావు, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి
పెట్రోల్ ధరల పెంపుతో రవాణా వ్యవస్థపై ప్రభావం పడి నిత్యావసర వస్తువుల ధరలు పెరగుతు న్నాయి. ప్రజలపై పెట్రో ధరల పెంపుతో ప్రత్యక్షంగా రూ.3 లక్షల కోట్లు, పరోక్షంగా రూ.5 లక్షల కోట్ల భారం పడుతోంది. నెలలో 27 రోజులు పెట్రోల్ చార్జీలు పెరిగాయి. కరోనాతో ప్రజలపై అనేక భారాలు పడ్డాయి. ప్రజలను ఆదుకోవాల్సిన ప్రభుత్వం నిత్యావసర వస్తువుల ధరలను పెంచడం అత్యంత దుర్మార్గం. కనీసం గత సంవత్సరం మార్చికి ముందున్న ధరలనైనా ఆచరణలో పెట్టాలి. ఈ నేపథ్యంలోనే నేడు ధర్నా చేపడుతున్నాం.