Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐఎంఏ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన
నవతెలంగాణ- ఖమ్మం
కరోనా బారిన పడి మొదటి, రెండో విడతలో చనిపోయిన వైద్యులను అమరులుగా గుర్తించడంతో పాటు వారి కుటుంబాలను ప్రత్యేకంగా ఆదుకోవాలనీ, వ్యాక్సిన్‌పైనా, అల్లోపతి వైద్యంపైనా కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన వారిని గుర్తించి తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం జిల్లా వ్యాప్తంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) ఆధ్వ ర్యంలో నిరసన ప్రదర్శనలు చేశారు. ఇటీవల వైద్యులపై జరుగుతున్న దాడులను కూడా నిరసిస్తూ నల్ల బ్యాడ్జీలు, నల్లచొక్కాలు, నల్లజెండాలతో నిరసన ప్రదర్శనలు చేశారు. ఖమ్మం ఐఎంఏ హాల్లో ప్రయివేటు వైద్యులు ప్లకార్డులు చేతబట్టి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. వైద్యులపై జరుగుతున్న దాడులను అరికట్టాలనీ, ఆల్లోపతి వైద్యం పట్ల ప్రజలకు చెడు సంకేతాలు పంపుతూ అమాయక ప్రజలను తప్పుదారి పట్టించడం ఏమాత్రం సరికాదని వారు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఐఎంఏ ఖమ్మం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ శోభాదేవి, డా,, కూరపాటి ప్రదీప్ మాట్లాడుతూ.. దేశంలో ప్రజల ప్రాణాలు కాపాడే క్రమంలో కరోనా వైరస్ బారిన పడి సుమారు 1500 మంది వైద్యులు మృతిచెందారని ఆవేదన వ్యక్తం చేశారు. వృత్తిలో ప్రాణాలు కోల్పోయిన వైద్యులను అమరవీరులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. వారి కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుని కుటుంబాలకు అండగా ఉండాలని ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. గతంలో డ్యూటీ డాక్టర్లపై దాడులకు పాల్పడిన వారికి పదేండ్ల పాటు జైలు శిక్షపడేలా రూపొందించిన చట్టాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. సనాతన సంప్రదాయం పేరుతో వ్యాక్సిన్‌ను, అలోపతి వైద్యాన్ని అపహాస్యం చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మంత్రి, ఎంపీ కార్యాలయాల్లో వినతిపత్రాలు అందజేత
వైద్యులపై జరుగుతున్న దాడులను అరికట్టాలనీ, బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ శు క్రవారం మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఎంపీ నామా నాగేశ్వరరావు కార్యాలయాల్లో ఐఎంఏ ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం వినతి పత్రాలను సమర్పించారు. అనంతరం కలెక్టర్ ఆర్ వీ కర్ణన్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఐఎంఏ జిల్లా కమిటీ ప్రతినిధులు, వైద్యులు డాక్టర్ యలమంచిలి రవీంద్రనాథ్, పీఎన్వీ ఎస్వీ ప్రసాద్, కొలికొండ శ్రీకాంత్, సంధ్యారాణి, డా. బొల్లికొండ శ్రీనివాసరావు, డా. కంభంపాటి నారాయణరావు (ఐఎంఏ కోశాధికారి), జీ వీ మురళి, సునీల్ కుమార్ జంగాల, రాఘవేంద్ర, శ్రీకళ, ఆదిశంకర్ రావు, విశ్వేశ్వర్, కొప్పు ధనమూర్తి, మోహన్, వెంకటేశ్, రత్నకుమార్ పాల్గొన్నారు.