Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.లక్షలు ధారబోసినా దక్కని ప్రాణాలు
- ఆర్థిక ఇబ్బందులతో బాధితులు సతమతం
- ప్రతి కుటుంబంలోనూ కన్నీటి వెతలే..!
నవతెలంగాణ- బోనకల్
రెండవ దశ కరోనా అనేక మంది ప్రాణాలను బలిగొని ఆ కుటుంబాలను ఆర్థికంగా ఛిన్నాభిన్నం చేసి వీధిన పడేసింది. ఆడపిల్లల పెళ్లి కోసం దాచుకున్న డబ్బులు పోగా మరింత అప్పులపాలై కొన్ని కుటుంబాలు వీధిన పడ్డాయి. మరికొన్ని కుటుంబాలు పూర్తిగా అప్పులపాలై కోలుకోలేని విధంగా మిగిలిపోయారు. ఆర్థికంగా తీవ్రంగా నష్ట పోవడమే కాక ఆ కుటుంబాలు పెద్ద దిక్కును కూడా కోల్పోయారు. కరోనా వ్యాధితో మరణించిన అనేక కుటుంబాలు నేడు ఆర్థికంగా అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
మండల వ్యాప్తంగా రెండవ దశ కరోనాతో 43 మంది చనిపోయారు. ఇందులో కొంత మంది హౌంక్వారంటైన్ లో ఉండి ఇంటి వద్దనే మాత్రలు వాడుతూ మరణిం చారు. దాదాపు 30 మందికి పైగానే వివిధ ఆస్పత్రులలో వైద్య చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆ కుటుంబాలను పరిశీలించగా అనేక బాధాకరమైన సంఘటనలు వెలుగు చూశాయి.
బోనకల్ గ్రామానికి చెందిన వత్సవాయి ప్రకాష్ కరోనాతో మృతి చెందాడు. ఖమ్మం, హైదరాబాద్‌లలో పలు ప్రైవేటు ఆసుపత్రులలో ఏడు రోజులు వైద్య చికిత్స పొందాడు. ఆ ఏడు రోజులకు గాను కుటుంబ సభ్యులు 12 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. అయినా ప్రాణాలు దక్కించుకోలేక పోయారు. మృతునికి భార్య, ఇద్దరు వివాహ వయస్సు వచ్చిన కుమార్తెలు ఉన్నారు. కుమార్తె వివాహం కోసం 5 లక్షల రూపాయలు పొదుపు చేసుకున్నాడు. కూతురికి పెళ్లి సంబంధం చూస్తున్న సమయంలోనే కరోనా వ్యాధి సోకింది. కరోనా వ్యాధి సోకడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. దాచుకున్న ఐదు లక్షలతో పాటు మరో ఏడు లక్షలు అప్పులు చేసి కుటుంబ సభ్యులు తీసుకువచ్చి వైద్యం చేయించారు. అయినా ఫలితం దక్కలేదు. దాచుకున్న సొమ్ము ఖర్చు కావడంతోపాటు అప్పు కావటం కన్న తండ్రిని కరోనా బలి తీసుకోవటంతో ఆ కుటుంబం నరకయాతన పడుతుంది.
ముష్టికుంట్ల గ్రామానికి చెందిన పోపూరి నరసింహారావు 24 రోజుల పాటు హైదరాబాదులో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్య చికిత్స పొందాడు. 20 లక్షల రూపాయలు వైద్యానికి ఖర్చు అయింది. ఇందులో 10 లక్షలకు పైగా కుటుంబ సభ్యులు అప్పు తీసుకువచ్చి వైద్యం చేయిం చారు. మృత్యువుతో పోరాడి చివరికి నరసింహారావు ఓడిపోయాడు.
అలాగే గోవిందపురం ఎల్ గ్రామానికి చెందిన కళ్యాణపు వెంకటేశ్వరరావు ( వెంకటయ్య) హైదరాబాదులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో 20 రోజులపాటు మృత్యువుతో పోరాడి చివరకు ఓడిపోయాడు. వెంకటేశ్వర రావుకి వైద్యం ఖర్చు 18 లక్షల రూపాయలు అయిందని కుటుంబ సభ్యులు తెలిపారు. వివాహం అయిన ముగ్గురు కుమార్తెలు అప్పులు చేసి తండ్రిని బతికించుకునేందుకు ప్రయత్నాలు చేసినా చివరకు ఫలితం దక్కలేదు.
రావినూతల గ్రామానికి చెందిన పొందూరు నాగేశ్వరరావు పదిహేను రోజుల పాటు ఖమ్మం లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వైద్య చికిత్స పొందాడు. కుటుంబ సభ్యులు వైద్యం కోసం 13 లక్షల రూపాయల వరకు ఖర్చు పెట్టారు. 10 లక్షలు వరకు అప్పు చేశారు. అయినా నాగేశ్వరరావు మృత్యువుతో పోరాడి తనువు చాలించాడు.
గోవిందాపురం ఏ గ్రామ సర్పంచ్ భాగం శ్రీనివాస రావు సతీమణి రమాదేవి 7 రోజుల పాటు ఖమ్మం, హైదరాబాద్ ఆసుపత్రు లలో కరోనాతో పోరాడి ఓడిపోయింది. కుటుంబ సభ్యులు వైద్యం కోసం ఐదు లక్షల రూపాయల వరకు ఖర్చు పెట్టారు.
చిరునోముల గ్రామానికి చెందిన ఇమ్మడి వెంకటరమణ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో 20 రోజులపాటు మృత్యువుతో పోరాడి ఓడిపోయింది. ఆమె వైద్యం కోసం కుటుంబ సభ్యులు 10 లక్షల రూపాయల వరకు ఖర్చు పెట్టారు.
చిన్న బీరవల్లి గ్రామానికి చెందిన ముళ్ళ పాటి చిట్టిబాబు అతి నిరుపేద కుటుంబానికి చెందిన వాడు. ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఐదు రోజుల పాటు చికిత్స పొంది కరోనాతో మృతి చెందాడు. కుటుంబసభ్యులు మూడు లక్షల రూపాయల వరకు అప్పు చేసి వైద్యం చేయించినా ఫలితం దక్కలేదు. ఈ కుటుంబం పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది.
ఈ విధంగా మండలంలో మృతి చెందిన కుటుంబ సభ్యులు ఆర్థికంగా నష్టపోయి వారి పరిస్థితి కడు దయనీయంగా మారింది. ఆ కుటుంబాల దయనీయ పరిస్థితి చూస్తుంటే ప్రతి ఒక్కరికీ కన్నీరు రాక తప్పదు. కరోనాతో మృతిచెందిన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి దొండపాటి నాగేశ్వరరావు, మండల ప్రజాప్రతినిధులు, ప్రజలు ముక్త కంఠంతో కోరుతున్నారు.