Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వైరా టౌన్
వైరా మండలం సిరిపురం గ్రామంలో ఐకేపీ కొనుగోలు కేంద్రం ద్వారా రైతుల దగ్గరనుండి దాన్యం కొనుగోలు చేసి ఎగుమతి చేయడంలేదని రైతులు శుక్రవారం ఉదయం నుంచి పెద్దఎత్తున ఆందోళన నిర్వహించారు. రైతులు సిరిపురంలోని వాటరుట్యాంకు పైకి ఎక్కి నిరసన తెలిపారు.
రోడ్డుపై ధాన్యం పోసి తగలబెట్టి ధర్నా చేశారు. రైతుల ఉద్యమానికి తెలంగాణ రైతు సంఘం సంపూర్ణ మద్దతు తెలిపింది. ధాన్యం కొనుగోలు విషయంలో వివక్ష కొనసాగుతోందని, కేవలం దళితుల ధాన్యం సన్న రకాల పేరుతో ఎగుమతి చేయకుండా జాప్యం చేస్తున్నారని, ఇతర రైతుల సన్న రకాల ధాన్యం బస్తాలను తరలింపు చేశారని, దళితరైతులకు అన్యాయం చేస్తున్నారని ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు బొంతు రాంబాబు ఆందోళన విషయాన్ని వైరా శాసన సభ్యులు లావుడ్య రాములు నాయక్, అధికారులు దృష్టికి తీసుకువెళ్లారు. వేంటనే ఎమ్మెల్యే లావుడ్య రాములు నాయక్ వైరా మార్కెట్ చైర్మన్ గుమ్మా రోశయ్యను రైతులు జరుపుతున్న ఆందోళన వద్దకు పంపించి మూడు రోజులలో ధాన్యం బస్తాలను ఎగుమతి చేయిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ(ఎం) వైరా మండల కార్యదర్శి తోట నాగేశ్వరావు, మట్టూరి నాగేశ్వరావు, ఐనాల కనకరత్నం, కొత్తపల్లి పుల్లయ్య, నారపోగు అయోధ్య, రాములు, వెంకట్, నల్లమల కోటేశ్వరరావు, శివ, పరుచూరి రామారావు తదితరులు పాల్గొన్నారు.
అనంతరం వైరా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శాసన సభ్యులు లావుడ్య రాములు నాయక్, మార్కెట్ చైర్మన్ గుమ్మా రోశయ్య, తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు బొంతు రాంబాబు, టిఆర్ఎస్ మండల అధ్యక్షులు పసుపులేటి మెహనరావు, సిపిఐ(ఎం) వైరా పట్టణ కార్యదర్శి సుంకర సుధాకర్, మండల కార్యదర్శి తోట నాగేశ్వరావుల ద్వారా మండలంలో ఉన్న ధాన్యం బస్తాలు నిల్వలపై సమాచారం తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్ ఆర్.వీ కర్ణన్, అదనపు కలెక్టర్ మధుసుదన్ రావు లతో మాట్లాడి వైరా మండలంలో 20000 ధాన్యం బస్తాలు కట్టాలు అయి మిల్లులకు తరలింపు కాక రైతులు ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే ధాన్యం బస్తాలు ఎగుమతి చేయాలని కోరారు.