Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పూర్తికాని స్మశాన వాటికలు
- దుర్వాసన వెదజల్లుతున్న వీదులు
- ఉన్నతాధికారులు పర్యవేక్షణ లోపం
నవతెలంగాణ-అశ్వాపురం
ప్రభుత్వం ప్రతీ ఏటా అట్టహాసంగా పల్లెప్రగతి కార్యక్రమాన్ని చేపట్టి పల్లెల రూపు మార్చేందుకు కంకణం కట్టుకుంది. ప్రతీ పల్లెలో స్మశానవాటికలు, పల్లెప్రకృతి వనాలు, పారిశుధ్య పనులు, రోడ్లు అభివృద్ధి చేపట్టేందుకు అధిక మొత్తంలో నిధులను సమకూర్చుతోంది. ఇంత చేస్తున్నా కొన్ని పంచాయ తీలలో అభివృద్ధి అరకొరగానే కొనసాగడం కొసమె రుపు. మండల పరిధిలోని తురుములగూడెం తంగా పంచాయతీలో చేపడుతున్న పల్లెప్రగతిలో తీవ్రమైన జాప్యం జరుగుతోంది. గత ఏడాది క్రితం మొదలు పెట్టిన స్మశానవాటిక పనులు ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్న చందంగా కొనసాగుతున్నాయి. పక్కనే నిర్మించిన డంపింగ్ షెడ్ మొక్కుబడిగానే ఉందే తప్ప దాన్ని వాడుకలోకి తీసుకువచ్చిన దాఖాలాలు లేవు. పల్లెప్రకృతి వనాలు మిగిలిన ప్రాంతాలలో పోల్చు కుంటే వనంలో ఎటువంటి మార్గాలు లేకుండా పెరటి తోటలో మొక్కలను పెంచుతున్నట్లు కనీసం గేట్లు కూడా లేకుండా డిఫరెంట్గా ఉండటం గమనార్హం. ఈ పంచాయతీలో జరుగుతున్న పల్లెప్రగతి పనులపై సంబందిత శాఖ జిల్లా ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపంవలనే అభివృద్ధి అంతంతమాత్రంగా జరుగుతోందని పలువురు అంటున్నారు.
దుర్వాసన వెదజల్లుతున్న వీదులు
నాలుగు చినుకులకే కొమ్ముగూడెం గ్రామంలోని వీదులు దుర్వాసన వెదజల్లుతున్నాయి. పేరుకు సీసీ రోడ్డు ఉన్నప్పటికీ ఇరువైపుల సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో మురుగునీరు పేరుకుని రోడ్డు వెంట దుర్వాసన వెదజల్లుతోంది. ఓ పక్కన కరోనా విళయతాండవం చేస్తుంటే ఈ గ్రామంలో మాత్రం పారిశుధ్యం అస్తవ్యస్తంగా తయారైంది. తాగునీటి బోర్లవద్ద కూడా పారిశుధ్యం అస్తవ్యస్తంగా ఉండటం చూస్తే మండల పంచాయతీ అధికారుల పర్యవేక్షణ ఏవిధంగా ఉందో ఇట్టే చెప్పొచ్చని ప్రజలు అంటున్నారు. ఇప్పటికైనా సంబందిత శాఖ జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ఈ పంచాయతీలో పర్యటించి పల్లెల్లో జరుగుతున్న ప్రగతిని పర్యవేక్షించాలని పలువురు కోరుతున్నారు.
మోడువారుతున్న హరితహారంలో నాటిన మొక్కలు
తురుములగూడెం తండా పంచాయతీలోని కొమ్ముగూడెం గ్రామానికి వెళ్ళె రహదారికి ఇరువైపుల హరితహారంలో నాటిన మొక్కలు పోషన సరిగాలేక మోడివారిపోతున్నాయి. మొక్కలైతే నాటారుగాని వాటిని రక్షించేందుకు టీ గార్డులు పెట్టిన దాఖలాలు లేవు. టీగార్డులు లేకపోవడం వలన మొక్కలు పశువులపాలవుతున్నాయి. ఉద్యమంలా మొక్కలు నాటి వాటిని సంరక్షించడంలో నిర్లక్ష్యం ప్రదర్శించడం వలనే మొక్కలు చిగురించకుండా పోతున్నాయని ప్రజలు అంటున్నారు.