Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణలో 341విత్తనాల విక్రయంపై నిషేధం
- ఆంధ్రా, మహారాష్ట్రల నుంచి కొనుగోలు చేస్తున్న రైతులు
నవతెలంగాణ-చర్ల
మంచి దిగుబడిని ఇచ్చే మిర్చి విత్తన రకాల్లో బీఎస్ఎఫ్ యూఎస్ 341 ఒకటి అనేది తెలంగాణ రైతుల సంపూర్ణ నమ్మకం. అందుకే బాండ్, నాన్బాండ్ రైతులు సైతం ఎక్కువగా ఈ విత్తనాన్ని ఇష్టపడి సాగుచేస్తారు. తెలంగాణ వ్యాప్తంగా సుమారు వేల ఎకరాల్లో యూఎస్ 341 రకం పంట సాగుచేస్తారు. గత సంవత్సరం పంటలో తేడా వచ్చిందంటూ వెంకటాపురం ప్రాంతానికి చెందిన కొందరు రైతులు అధికారులకు ఫిర్యాదులు చేసి కోర్టుని ఆశ్రయించడంతో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో యూఎస్ 341 రకం విత్తనాల అమ్మకాలను నిషేధించింది. దీంతో ఈ ఏడాది రైతులకు చిక్కులు వచ్చి పడ్డాయి. ఎన్నో ఏళ్లుగా సాగుచేస్తున్న 341 రకం విత్తన నిషేధంపై రైతులు భగ్గున మండిపడుతున్నారు. రాజకీయ విభేదాలు, నాయకుల నడుమ పంతాలు పట్టింపుల పరిస్థితులే 341 విత్తన నిషేధానికి దారితీశాయని రైతులు ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో బీఎస్ఎఫ్ యూఎస్ 341 రకం మిర్చి విత్తనాలు లభించక పోవడంతో సరిహద్దు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు రైతులు పరుగులు తీస్తున్నారు.
రైతులు తమకు నచ్చిన విత్తనాల పంట వేసుకొనే అవకాశం కేంద్ర ప్రభుత్వం కల్పించింది. అంతేగాక తగిన రసీదులు పొంది ఎక్కడైనా అట్టి విత్తనాలు కొనుగోలు చేసుకునే అవకాశం ఉంది. దీంతో కరీంనగర్, అదిలాబాద్, వరంగల్ ప్రాంతాల రైతులు మహారాష్ట్ర నుంచి, అలాగే ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతులు ఆంధ్రాలోని గుంటూరు, నందిగామ, ఎటపాక తదితర ప్రాంతాల నుంచి బిఎస్ఎఫ్ యూఎస్ 341 రకం విత్తనాలు తెచ్చుకుంటున్నారు. ఈ విత్తనాల కోసం వ్యయప్రయాసలు పడుతున్నట్లు రైతులు తెలిపారు. ఆరు కాలం కష్టించి పంట పండించే రైతు విత్తనాలు కొనుక్కోవడానికి పక్క రాష్ట్రాలకు వెళ్లి సమయాన్ని డబ్బును వృధా చేసుకుంటున్నారు. అయితే కేవలం ఏజెన్సీ ప్రాంతంలో కొంతమంది బడాబాబుల మధ్య కుదరని సైకత వలనే మంచి దిగుబడి వచ్చే బిఎస్ఎఫ్ యూఎస్ 341 మిర్చి రకాన్ని తెలంగాణ రైతులు కోల్పోయారని పలువురు విశ్లేషిస్తున్నారు. ఇకనైనా తెలంగాణ ప్రభుత్వం మేలు రకమైన విత్తనాన్ని రైతులు కొనుక్కోవడానికి అవకాశం ఇవ్వాలని రైతులు కోరుతున్నారు
రైతులు మక్కువ చూపుతారు : ఏవో
తెలంగాణలో యూఎస్ 341 రకం మిర్చి విత్తనాలు అమ్మడా నికి వీల్లేదు. ఆ రకం విత్తనాల అమ్మకంపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. అయితే ఆంధ్రా ప్రాంతం నుంచి కొందరు రైతులు 341 తెచ్చుకుంటు న్నట్లుగా తెలుస్తోంది. రైతులు తమకు నచ్చిన పంట సాగుచేసుకునే వెసులుబాటు ఉంది. దానిని మనం కాదనలేము. విత్తనం ఎంపిక రైతుల ఇష్టం. విత్తన నిషేధం వలన 341 సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గుతుందని చెప్పవచ్చును. కొంతమంది రైతులు 341 రకం మిర్చి పంటనే సాగుచేయడానికి ఇష్ట పడతారు.
ఈ ప్రాంతానికి సూటైన రకం 341 : పోలిన మురళి , రైతు, చింతకుంట
ఏజెన్సీ ప్రాంతం గోదావరి నది తీర ప్రాంతంలో అధిక దిగుబడులు ఇస్తూ రైతుకి లాభసాటిగా ఉండే బిఎస్ఎఫ్ యూఎస్ 341 చాలా సూటైన రకం, ఎన్నో ఏళ్లుగా రైతాంగం 341 పంట పండించి చక్కని లాభాలు పొందుతున్నారు. అటువంటి 341 రకాన్ని తెలంగాణ ప్రభుత్వం నిషేధించడం దురదృష్టకరం. ఇకనైనా అధికారులు, ప్రజా ప్రతినిధులు నాణ్యమైన 341 విత్తనాలపై నిషేధం ఎత్తివేయాలి.