Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
- ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం బాధ్యులపై చర్య తీసుకోవాలి
నవతెలంగాణ-చింతకాని
దళిత మహిళ మరియమ్మను పోలీసులే హింసించి లాకప్ డెత్ చేశారని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. చింతకాని మండలం కోమట్ల గూడెం గ్రామానికి చెందిన అంబటిపూడి మరియమ్మ ఓ కేసు విషయమై యాదాద్రి జిల్లా పోలీసుల అదుపులో ఉండగా మరణించిన విషయం తెలిసిందే బాధిత కుటుంబాలను ఆదివారం మల్లు భట్టి విక్రమార్క కోమట్ల గూడెం గ్రామానికి వచ్చి పరామర్శించారు. జరిగిన సంఘటనపై నాలుగు గంటల పాటు 100 మంది నుంచి గ్రామంలో సమాచారం సేకరించారు. చింతకాని పోలీస్ స్టేషన్ లో కూడా తన తల్లి మరియమ్మను సోదరుడిని మూడు గంటల పాటు తన కళ్ళ ముందే కొట్టారని కుమార్తె భట్టి విక్రమార్కకు వివరించారు. భట్టి విక్రమార్క మాట్లాడుతూ దేశద్రోహులను టెర్రరిస్టులను కూడా ఇంత దారుణంగా హింసించరని ఆయన పేర్కొన్నారు. పోలీసులు అతిగా ప్రవర్తించడానికి ముఖ్యమంత్రి కెసిఆర్ వైఖరే కారణమన్నారు. పోలీసులు కనీసం మానవత్వం కూడా లేకుండా అర్ధరాత్రి మహిళలను అదుపులోకి తీసుకొని కొట్టి చంపడం దారుణం అన్నారు. ఈ సంఘటన జరిగి నాలుగు రోజులు అవుతున్న స్థానిక యంత్రాంగం వాస్తవాలను గుర్తించకపోవడం సరికాదన్నారు. భట్టి విక్రమార్క గ్రామం నుంచే కలెక్టర్ ఆర్వి కర్ణన్, కమిషనర్ విష్ణు వారియర్ తో మాట్లాడి ఈ సంఘటనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం బాధ్యులైన వారు సంఘటన దాచేందుకు ప్రయత్నించిన వారి పైన కేసు నమోదు చేయాలని భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని ఆయన కలెక్టర్కు సూచించారు. మహిళా కానిస్టేబుల్ ఉన్నారా, వివరాలు రికార్డుల్లో నమోదు చేశారా పోలీసుల అత్యుత్సాహం ఎందుకు ప్రదర్శించాల్సి వచ్చిందని సిఐ వసంత కుమార్ను ప్రశ్నించారు. అనంతరం సిసి కెమెరా ఫుటేజీలను ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, రాష్ట్ర కాంగ్రెస్ ఎస్సీ సెల్ చైర్మన్ ప్రియతం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంబటి వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ నాయకులు బొర్రా ప్రసాద్, కూరపాటి కిషోర్ కొప్పుల గోవిందరావు, కొత్తపల్లి రామకృష్ణ, పాల్గొన్నారు.