Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెద్దతండాను సందర్శించిన కలెక్టర్
- పలువురికి షోకాజ్ నోటీసులు...
- కలెక్టర్ ఆర్.వి.కర్ణన్
నవతెలంగాణ-ఖమ్మం రూరల్
మండలంలోని పెద్దతండా గ్రామ పంచాయితీని జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్ ఆదివారం ఆకస్మిక తనిఖీ చేసారు. ఈ సందర్భంగా పెద్దతండాలో నర్సరీ, డంపింగ్ యార్డు, తడి చెత్త, పొడి చెత్త వేరు చేసే షెడ్ల నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు. పల్లె ప్రగతి పనుల్లో ఆశించిన మేర లక్ష్యాలను సాధించడంలో నిర్లక్ష్యం వహించిన ఎంపిఓ పి.వి.ఎల్. శాస్త్రీ, పెద్దతండా పంచాయితీ సెక్రటరీ కె.రామకృష్ణ, జూనియర్ అసిస్టెంట్ యస్.గోపాల్‌కు షోకాజ్ నోటీసు జారీచేయాలని జిల్లా పంచాయితీ అధికారి ప్రభాకర్ రావు ను కలెక్టర్ ఆదేశించారు. గ్రామాలలో పల్లె ప్రగతి పనులన్ని వందశాతం సక్రమంగా నిర్వహించాలని, పారిశుధ్యం పనులు నిరంతరాయంగా జరగాలని, పచ్చదనం పెంపొందించేందుకు నాటిన ప్రతి మొక్కను సంరక్షించే బాధ్యత గ్రామ పంచాయతీ కార్యదర్శితో పాటు స్థానిక ప్రజాప్రతినిధులపై ఉందని కలెక్టర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా జిల్లాలోని పల్లెలన్నీంటిని పరిశుభ్రత, పచ్చదనంతో కళకళలాడేలా చేసుకోవాలని, పల్లె ప్రగతి పనులు పూర్తి చేయని గ్రామ స్థాయి అధికారులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్,రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వడ అజరు లు జిల్లాలో పల్లె ప్రగతి పనులను ఆకస్మికంగా తనిఖీ చేయనున్న నేపథ్యంలో పెండింగ్ పనులన్నీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి వినియోగంలోకి తేవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.నర్సరీ నిర్వహణ సక్రమంగా ఉండాలని,ఇంటింటి నుండి సేకరించిన తడి,పొడి చెత్తను వేరు చేయాలని గ్రామాలలో డంపింగ్ యార్డులు,వైకుంఠధామాలు ప్రజలకు అందుబాటులోకి తేవాలని కలెక్టర్ ఆదేశించారు. పెద్దతండా,ఏదులాపురం, గుదిమళ్ళ,వెంకట గిరి,గుర్రాల పాడు గ్రామ పంచాయితీ లలో వెంటనే తడి చెత్త,పొడి చెత్త వేరు చేసే షెడ్ల నిర్మాణానికి స్థలాలు గుర్తించాలని తహసీల్ధార్ శ్రీనివాసరావు ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిపిఓ ప్రభాకర్ రావు,తహసీల్ధార్ కారుమంచి శ్రీనివాసరావు, మండల ప్రత్యేక అధికారి నాగరాజు, ఎంపిఓ శాస్త్రి,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.