Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా జీవో నంబర్ 51 ద్వారా ఉద్యోగులకు నూతన పే స్కేల్ మంజూరు చేసిందని జిల్లా ఖజానా కార్యాలయం ఉపసంచాలకులు వెంటపల్లి సత్యనారాయణ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు జిల్లాలోని డ్రాయింగ్ అధికారులకు పలు సూచనలు చేశారు. 1 జూలై 2018 నుంచి వేతన సవరణ చేయాలన్నారు. ప్రతి ఉద్యోగి తన వేతన సవరణకు ఆప్షన్ రెండు విధాలుగా ఇవ్వాలని పేర్కొన్నారు. 1-7-18 నాటి వేతనం లేదా 30-6-2019 లోపు వచ్చే ఇంక్రిమెంట్ తేదీకి గానీ ఆప్షన్ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఏదీ ప్రయోజనంగా ఉంటుందో దాన్ని ఆప్షన్ ఫారంలో నింపి మూడు సెట్లు డ్రాయింగ్ అధికారికి ఇవ్వాలని తెలిపారు. ఆప్షన్ ఫారమ్స్ ఉద్యోగి నుంచి తీసుకున్నాక సంబంధిత డ్రాయింగ్ అధికారి సర్వీసు రిజిస్టర్‌ను పరిశీలించి ఉద్యోగుల వేతన స్థిరీకరణ స్టేట్మెంట్లను సర్క్యూలర్‌లో జత చేయాలని డ్రాయింగ్ అధికారులకు సూచించారు. ఫిక్సేషన్ స్టేట్మెంట్ను సర్వీసు రిజిస్టర్లో పొందుపరచాలని పేర్కొన్నారు. ఉద్యోగి ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం ఫిక్సేషన్ స్టేట్మెంట్ తయారు చేసి ప్రతి ఉద్యోగికి నాలుగు విధాలా బిల్లులను తయారు చేయాలని సూచించారు. 1-7-18 నుంచి 31-3-20 (నోషనల్), 1-4-20 నుంచి 31-3-21, 1-4-21 నుంచి 31-5-21, 1-6-21 జూన్ వేతనంతో పాటు చెల్లిస్తారని తెలిపారు. రెండో భాగంలో చూపించిన మొత్తం ఉద్యోగి పదవీ విరమణ సమయంలో చెల్లిస్తారన్నారు. ఒకవేళ ఉద్యోగి మరణిస్తే లీగల్ హైర్స్కు చెల్లిస్తారన్నారు. మూడో భాగంలో చూపించిన మొత్తం ఈ ఆర్థిక సంవత్సరంలో చెల్లిస్తారన్నారు. డ్రాయింగ్ అధికారులు జూన్ మాసం బిల్లులు క్లైం చేస్తూ తయారు చేసే బిల్లులపై ( క్లైం ఫర్ పే ఫిక్సేషన్ ఎరియర్స్ ఇన్ ది రివైజ్డ్ పే స్కేల్స్ 2020) రెడ్ ఇంక్‌తో బిల్లు పైన సూచించాలని తెలిపారు. ఉద్యోగి సర్వీసు రిజిస్టర్‌తో సహా ట్రెజరీకి సమర్పించాలని పేర్కొన్నారు. ఉద్యోగుల వివరాలు, వర్కింగ్ వేకెంట్ పొజిషన్‌తో పాటు ప్రతీ ఉద్యోగికి పీఆర్సీ కారణంగా నోషనల్కు గాను నగదురూపంలో వస్తున్న వివరాలు తెలియజేసే పట్టికను ట్రెజరీకి సమర్పించాలని తెలిపారు. ఖజానా టెక్నికల్ విభాగం సాఫ్ట్‌వేర్‌ను రెండురోజుల్లో ఆధునీకరించనున్న దృష్ట్యా డ్రాయింగ్ అధికారులు తమ ఉద్యోగుల వివరాల ఆప్షన్ ఫార్మ్స్, స్థిరీకరణ పట్టికలు, ఉద్యోగుల జాబితాను సిద్ధం చేసి ఖజానాకు సమర్పించాల్సిందిగా డీడీ పేర్కొన్నారు.