Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ధాన్యం కొనుగోళ్లలో సత్తుపల్లిదే అగ్రభాగం
- సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య
- కేసీఆర్ చిత్రపటానికి పుష్పాభిషేకం
నవతెలంగాణ- సత్తుపల్లి
రైతుకు బాసటగా నిలవడమే ముఖ్యమంత్రి కేసీఆర్ మార్కు అని, దేశంలోనే ఎక్కడా లేని విధంగా రైతు పండించిన పంటలను కొనుగోలు చేయడం ఇందుకు తార్కాణమని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. రైతు పలు రకాలుగా చేదోడు వాదోడుగా ఉంటూ రైతు పండించిన పంటలను కొనుగోలు చేయడం, అన్నదాతకు ఆర్థిక చేయూతగా రైతుబంధు పథకం ద్వారా పెట్టుబడి అందించడం ఇలా అనేక రకాలుగా రైతుకు వెన్నుదన్నుగా ముఖ్యమంత్రి కేసీఆర్ నిలుస్తున్నారని ఎమ్మెల్యే సండ్ర తెలిపారు. ఈ నేపధ్యంలో రైతు బాంధవుడిగా ఉన్న కేసీఆర్ పదికాలాల పాటు ఆయురారోగ్యాలతో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఆదివారం కేసీఆర్ చిత్రపటానికి ఎమ్మెల్యే సండ్ర పూలతో అభిషేకం చేశారు. ఈ సందర్భంగా సండ్ర మాట్లాడుతూ నేటితో జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యాయన్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ యేడాది 3.70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు అయితే ఒక్క సత్తుపల్లి నియోజకవర్గంలోనే 1.81లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగిందన్నారు. గత యేడాదితో పోల్చితే ఇది రెట్టింపన్నారు. ఈ యేడాది పంట దిగుబడి కూడా రెట్టింపు వచ్చిందన్నారు. పాలేరు, ఖమ్మం, మధిర నియోజకవర్గాలు కలిపి ఎంతైతే కొనుగోళ్లు జరిగాయో ఒక్క సత్తుపల్లి ఈ మూడు నియోజకవర్గాల్లో జరిగిన కొనుగోలుకు సమానమన్నారు. మిల్లుల సమస్య ఉన్న నేపధ్యంలో కరీనంగర్, వరంగల్, నల్గొండ జిల్లాలకు మన ధాన్యాన్ని తరలించేందుకు చాలా శ్రమించాల్సి వచ్చిందన్నారు. ఇంత మొత్తంలో ధాన్యం కొనుగోళ్లు జరగడానికి సొసైటీ అధ్యక్షుల కృషి ఉందన్నారు. కొత్తూరు రైతు వేదిక వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీపీ దొడ్డా హైమవతి శంకరరావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు యాగంటి శ్రీనివాసరావు, డీసీసీబీ డైరెక్టర్లు చల్లగుండ్ల కృష్ణయ్య, గొర్ల సంజీవరెడ్డి, ఎంపీటీసీ సభ్యులు తుంబూరు కృష్ణారెడ్డి, విస్సంపల్లి వెంకటేశ్వరరావు, నాయకులు గాదె సత్యనారాయణ, వెల్ది జగన్మోహనరావు, దొడ్డా శంకరరావు, ఒగ్గు శ్రీనివాసరెడ్డి పాలకుర్తి రాజు పాల్గొన్నారు.
ఫుడ్ బ్యాంకు ఆశాఖాన్ సేవలు అభినందనీయం
లాక్ డౌన్ ప్రారంభం నుంచి నేటి వరకు గత 50 రోజులుగా ఫుడ్ బ్యాంకు ఆధ్వర్యంలో నిరంతరంగా పఠాన్ ఆశాఖాన్ ఆహార సేవలు అందించడం అభినందనీయమని ఎమ్మెల్యే సండ వెంకటవీరయ్య కొనియాడారు. 50 రోజులుగా నిరంతరాయంగా కరోనా బాధితులకు, ఐసోలేషన్ లో ఉంటున్న కుటుంబాలకు ఆహార సేవలు ముగింపు సందర్భంగా ఆశాఖాన్ ను ఎమ్మెల్యే సండ్ర ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా సన్మానించారు. ఆశాఖాన్ అందిస్తున్న సేవలను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి వద్ద జరిగిన ఈ సన్మాన కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేశ్, ఎంపీపీ దొడ్డా హైమవతిశంకరరావు, ఆసుపత్రి సూపరిటెండెంట్ పాకలపాటి వసుమతీదేవి, నాయకులు దొడ్డా శంకరరావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు యాగంటి శ్రీనివాసరావు, గాదె సత్యనారాయణ, ఎంపీటీసీ పాలకుర్తి రాజు, కౌన్సిలర్ అద్దంకి అనిల్ కుమార్ పాల్గొన్నారు.