Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆనందయ్య మందులో కరోనా నియంత్రణ శక్తి ఉంది
- వివిధ రకాల దినుసుల్లో ఔషధ గుణాలున్నాయి...
- ప్రభుత్వాల నిర్లిప్తత వల్లనే అధిక మరణాలు
- వ్యాక్సినేషన్ ప్రక్రియలో వేగం పెంచాలి
- ప్రముఖ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
కరోనా విషయంలో అజ్ఞానాన్ని వీడి సైన్స్‌ను నమ్మాలని ప్రముఖ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ అన్నారు. అజ్ఞానమనేదే కరోనా...అదే భయానికి ఏకైక కారణమని పేర్కొన్నారు. జాషువా సాహిత్య వేదిక ఆధ్వర్యంలో 'కోవిడ్ పరిణామాలు...శాస్త్రీయ ఆలోచనలు' అనే అంశంపై ఆదివారం నిర్వహించిన వెబ్‌నార్‌లో నాగేశ్వర్ ప్రసంగించారు. సాక్ష్యాత్తు కేంద్రమంత్రే కరోనా నియంత్రణకు పాపడలు, గోమూత్రం, ఆవుపేడను ఉపయోగించాలి అంటూ ప్రజలను గందరగోళానికి గురిచేస్తూ వ్యాఖ్యలు చేయడాన్ని ఆయన విమర్శించారు. ఆనందయ్య మందుపై జరిగిన వ్యాపారాత్మక రాజకీయ దాడిని ఖండించారు. ఆయుర్వేద శాస్త్రంలో ప్రతిపాదించిన ఔషధాలలో శాస్త్రీయ గుణాలను కాదనలేమన్నారు. ఇంట్లో వాడే అన్ని దినుసుల్లో ఔషధ గుణాలున్నాయన్నారు. అవి కరోనాను ఎదుర్కొనే శక్తి ఉన్నవే అన్నారు. వాటి శాస్త్రీయ పరమైన గుణాలను విపులీకరించి ప్రజలకు అవగాహన కలిగించే బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. కరోనా తొలి, రెండో వేవ్ మధ్య మన అజాగ్రత్త వల్లనే ప్రాణనష్టం జరిగిందన్నారు. సైన్స్ పట్ల నిర్లిప్తత వీడాలన్నారు. దేశంలో 30 శాతం మందికే వ్యాక్సినేషన్ పూర్తయిందన్నారు. వివిధ దేశాల్లో 55శాతం మందికి వ్యాక్సినేషన్ వేసినట్లు చెప్పారు. ఇప్పటికైనా వేగంగా వ్యాక్సినేషన్ ప్రకియను పూర్తి చేయాలన్నారు. మువ్వా శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అట్లూరి వెంకటరమణ, పగిడిపల్లి వెంకటేశ్వర్లు, వివిధ విద్యాసంస్థల విద్యార్థులు, విద్యావేత్తలు, మేధావులు పాల్గొన్నారు.