Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సతమతమవుతున్న అధికార యంత్రాంగం
- పొట్ట చేత పట్టుకుని గిరిజనులు భూ పోరాటం
- ముఖ్యమంత్రి హామీలు నెరవేరేనా..?
నవతెలంగాణ-పినపాక
తరాలు మారినా ఏజెన్సీలో నివసిస్తున్న పోడు రైతుల తలరాతలు మారడం లేదు. ప్రభుత్వాలు మారుతూ ఉన్న పోడు రైతుల జీవితాలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్లుగా కొనసాగుతుంది. పంట వేసే కాలం ప్రారంభం కాగానే పోడు భూముల్లో వివాదాల కల్లోలం ఆగడం లేదు. అన్నదమ్ముల్లా కలిసి ఉండే ప్రజల్లో వర్గ వైరాలు ప్రబలుతున్నాయి. అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్టు చూడడమే తప్ప ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంది. సాక్షాత్ తెలంగాణ ముఖ్యమంత్రి పోడు భూముల పైన అసెంబ్లీ సాక్షిగా వరాల జల్లు కురిపించినా పోడు రైతు కంట కన్నీటి ధార ఆగడం లేదు. అమాయక ఆదివాసీ జనం ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని అమాయకంగా ఎదురుచూస్తున్నారు. కేవలం పత్రికా ప్రకటనలోనే వారికి న్యాయం కనపడుతుంది కానీ ప్రభుత్వం భూ పోడు పట్టాలు అందించడంలో మొండి చెయ్యి ఎదురవుతుంది. పోడు భూముల్లో వివాదాలు అయినప్పుడు ఒకవైపు అటవీ యంత్రాంగం, మరో వైపు రెవెన్యూ రెండు కళ్ళతో భూములను పర్యవేక్షించాలని చూస్తున్నా, చివరికీ పోలీస్ శాఖ అధికారులకు ఈ వివాదాలు తలనొప్పిగా తయారయ్యాయి. రైతు బిడ్డలపై చేయి చేసుకోవడానికి, కర్ర బెదిరించడానికి పోలీసు యంత్రాంగం సైతం ఈ ఆలోచన చేస్తుంది. ఈ వివాదాలు ఇలాగే కొనసాగితే అధికార యంత్రాంగానికి కొత్త తల నొప్పులు వచ్చే అవకాశం ఉంది. ఒక వైపు ముఖ్యమంత్రి స్వయంగా నేనే వస్తా సమస్య పరిష్కరిస్తా అన్న హామీ మరోవైపు నియోజకవర్గం బాస్ రేగా కాంతారావు ఉన్నాడని భరోసా పోడు రైతుకు కొంత ధైర్యాన్ని ఇస్తున్న, గత దాడులు ఎందుకు జరుగుతున్నాయో అర్థం కాక అమాయక గిరిజనుల ప్రజలు అల్లాడుతున్నారు. పొట్ట చేత పట్టుకొని అమాయక రైతులు భూములులోకి వెళితే ఫారెస్ట్ అధికారులు కేసులు నమోదు చేస్తున్నారు. ఎవరిని సంప్రదించాలి. ఎక్కడ న్యాయం జరుగుతుంది అర్థం కాక ఏజెన్సీ వాసులు బిక్కుబిక్కుమని జీవనం కొనసాగిస్తున్నారు. ఏజెన్సీలో చాలా మండలాల్లో రైతుల మధ్య వివాదాలు తారాస్థాయికి చేరి రక్తపాతం జరిగేదాకా చేరింది. భూమిని దున్ని తమ చెమటతో పంటను పండించవలసిన చోట రైతు రక్తంతో భూదేవి తడుస్తుంది. పోడు రైతుల కష్టాలు త్వరలో తీరాలని నియోజవర్గ ప్రజలు కోరుకుంటున్నారు.
పోడు భూములకు వెంటనే పట్టాలు ఇవ్వాలి
అధికారులు, ప్రజా ప్రతినిధులు ఆదివాసీ గిరిజనులకు పోడు భూములకు పట్టాలు ఇస్తామని ఆశ చూపి మోసగిస్తున్నారు. ఎంతోకాలంగా భూమిని నమ్ముకున్న గిరిజనులకు అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. రైతులకు ప్రాణ నష్టం జరగకముందే ప్రభుత్వం స్పందించాలి. పినపాక నియోజకవర్గంగా ఉన్న పోడు భూముల సమస్యలు వెంటనే తీర్చాలి.
- తుడుందెబ్బ జిల్లా అధ్యక్షులు ఆలెం కోటి