Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రోప్‌ల సహాయంతో ప్రొక్లైన్ ద్వారా ట్రెంచ్ పనులు
- అడ్డుకున్న గిరిజన మహిళా రైతులను నెట్టేసిన అటవీ సిబ్బంది
- పలువురిని జీపు ద్వారా రేంజి కార్యాలయానికి తరలింపు
నవతెలంగాణ-దుమ్ముగూడెం
దుమ్ముగూడెం అటవీ రేంజి పరిధిలోని దుమ్ముగూడెం సెక్షన్లో గల పైడిగూడెం, తోగ్గుడెం గిరిజన గ్రామాల సరిహద్దు అటవీ ప్రాంతంలో గత కొంత కాలంగా పైడిగూడెం పోడుసాగుదారులకు, అటవీ సిబ్బందికి మద్య ఘర్షణ వాతావరణం కొనసాగుతోంది, అటవీ శాఖ అధికారులు భూములను చదును చేసేందుకు పలు మార్లు డోజర్లు, ప్రొక్లైన్లతో పోడు భూముల వద్దకు వెళ్లినప్పుడు మహిళా గిరిజన పోడు రైతులు అడ్డు కోవడం వంటి సంఘటనలు పలు మార్లు జరిగాయి. పోడు భూముల వ్యవహారం ఉద్రిక్తతను తెలుసుకున్న పినపాక శాసన సభ్యుడు ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పైడిగూడెంలో పర్యటించి పోడు సాగుదారులకు భరోసా కల్పించారు. భద్రాచలం శాసన సభ్యులు పొదెం వీరయ్య ఎఫ్డీఓ బాబును కలిసి పోడు సాగుదారుల సమస్యను పరిష్కరించాలని వినతి పత్రం సైతం అందజేశారు. గిరిజన మహిళా పోడు రైతులు మాత్రం చావనైనా చస్తాం కానీ పోడు భూములను వదులుకునేది లేదని అటవీ శాఖ అధికారులు చేస్తున్న పనులు అడ్డు కోవడంతో పాటు చింత గుప్ప గిరిజనులు అటవీ సిబ్బందిని చెట్టుకు కట్టేసి తమ అగ్రహాన్ని వెలిబుచ్చారు.
అందులో భాగంగా సోమవారం అటవీ శాఖ సిబ్బంది పెద్ద ఎత్తున సపైడి గూడెం పోడు భూముల వద్దకు వెళ్లి రోప్ (తాడు) సహాయంతో ప్రొక్లైన్ ద్వారా ట్రెంచ్ పనులు చేపట్టారు. విషయం తెలుసుకున్న గిరిజన మహిళా పోడు సాగుదారులు అగ్రహంతో పనులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో మహిళా అటవీ సిబ్బంది వారిని నెట్టి వేసే ప్రయత్నంతో కొంత ఘర్షణ వాతావరణం చోటు చేసుకుందనే చెప్పవచ్చు.
నలుగురు గిరిజన మహిళా పోడు సాగుదారులను అటవీ సిబ్బంది జీపు ద్వారా రేంజి కార్యాలయానికి తీసుకు వెళ్లారని పోడు సాగుదారులు ఆరోపిస్తున్నారు. ఈ విసయమై నవతెలంగాణ అటవీ రేంజి అధికారి కనకమ్మ, డీఆర్వో అప్సరున్నీసాబేగంకు ఫోన్ చేయగా వారు అందుబాటులోకి రాలేదు.