Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 26న జిల్లా కేంద్రం, మండల కేంద్రాల్లో నిరసనలు
- ప్రతి కుటుంబానికి రు.7,500/- ఇవ్వాలి
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు
నవతెలంగాణ-ఖమ్మం
వ్యవసాయాన్ని రక్షిద్దాం ! దేశాన్ని కాపాడుదాం !! పేరుతో జూన్ 26న దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసన కార్యక్రమాలకు మద్దతుగా జిల్లా కేంద్రంలో మరియు మండల కేంద్రాల్లో నిరసనలు వ్యక్తం చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు యర్రా శ్రీకాంత్ అధ్యక్షతన జరిగిన జిల్లా కమిటీ సభ్యులు, మండల కార్యదర్శుల సంయుక్త సమావేశంలో నున్నా నాగేశ్వరరావు పాల్గొని మాట్లాడారు. కేంద్రంలోని బిజెపి నరేంద్రమోడీ ప్రభుత్వం మూడు రైతు వ్యతిరేక చట్టాలను, విద్యుత్ సవరణ బిల్లును తెచ్చిందని, 44 కార్మిక చట్టాలను, 4 కోడ్లుగా మార్పు చేసిందని వీటిని వెనక్కి తీసుకోవాలన్నారు. 200 రోజుల పైగా కార్మిక, కర్షక ఐక్య ఉద్యమం జరుగుతున్నా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకీ విపరీతంగా పెంచుతూ ప్రజలపై భారాలు మోపుతోందని విమర్శించారు. కరోన వల్ల అనేక మంది ఉపాధి కోల్పోయారని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నార న్నారు. ప్రత్యేకమైన ప్యాకేజీ ప్రకటించి అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతాంగం పండిస్తున్న పంటలకు స్వామీనాధన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం పెట్టుబడికి అదనంగా 50 శాతం కలిపి మద్ధతు ధరలు ప్రకటిస్తామని చెప్పి మోసం చేసిందని అన్నారు. రైతాంగ ఉద్యమంపై నిర్భందాన్ని ప్రయోగిస్తుందన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై దేశ ద్రోహం, రాజ ద్రోహం కేసులను బనాయిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. సమ్మె హక్కును కాల రాస్తుందని అన్నారు. ఈ నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని దేశవ్యాప్త పిలుపులో భాగంగా జూన్ 26న జరగబోయే నిరసన నిరసన కార్యక్రమాన్ని జిల్లాలో జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి పేద కుటుంబానికి నెలకు రూ. ,7500/- రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు, మాచర్ల భారతి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండి రమేష్, భూక్యా వీరభద్రం, కళ్యాణం వెంకటేశ్వరరావు, బుగ్గవీటి సరళ మరియు పార్టీ జిల్లా కమిటీ సభ్యులు మండల కార్యదర్శులు పాల్గొన్నారు.