Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంజూరు పోస్టులు 39 ...ఖాళీలు 8 - సిబ్బంది కొరతతో అవస్థలు
నవతెలంగాణ- బోనకల్
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే రాజకీయ చైతన్యం కలిగిన మండలం. కమ్యూనిస్టు పార్టీల పోరాటాల గడ్డ. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అనుగుణంగా పోలీసు సిబ్బందిని నియమిస్తుంది. కానీ ఆచరణలో అది అమలు కావడం లేదు. దీంతో పోలీస్ సిబ్బంది కొరతతో ప్రతి ఎస్ఐ అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి సంవత్సరం 8 నుంచి 10 పోస్టులు ఖాళీగా ఉంటున్నాయి. రాజకీయ చైతన్యం కలిగిన మండలానికి పోలీసు సిబ్బంది కొరత ఉంటే మామూలు మండల పరిస్థితి మరింత దయనీయంగా ఉండే అవకాశాలే ఉండి ఉంటాయి. స్థానిక సంస్థల ఎన్నికల అయినా జనరల్ ఎన్నికలు అయినా బోనకల్ మండలంలో పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తుంటారు. అంత ప్రాధాన్యత కలిగిన బోనకల్ పోలీస్ స్టేషన్ సిబ్బంది కొరతతో అవస్థలు పడుతోంది. బోనకల్ పోలీస్ స్టేషన్‌లోని నిబంధనల ప్రకారం వాస్తవంగా ఇద్దరు ఎస్ఐలను నియమించాల్సి ఉంది. కానీ పోలీస్ స్టేషన్ ప్రారంభం నుంచి నేటి వరకు ఇద్దరి ఎస్ఐలను రాష్ట్ర ప్రభుత్వం నియమించలేదు. ఎప్పుడు రెండో పోస్ట్ ఖాళీగానే ఉంటుంది. అదేవిధంగా ఏఎస్ఐలు ముగ్గురు ఉండాలి. ప్రస్తుతం ముగ్గురు ఉన్నారు. కానీ ఒక ఏఎస్ఐ బదిలీ అయి నెలలు గడుస్తోంది. అయితే ఏఎస్ఐ ఇక్కడ నుంచి రిలీవ్ కాకపోవటంతో పోస్ట్ ఖాళీగా చూపించడం లేదు. ఏఎస్ఐ ఇక్కడ విధులు నిర్వహిస్తున్నట్లుగానే రికార్డు పరంగా ఉంది. కానీ ఆయన ఎక్కడ అ విధులు నిర్వహించడం లేదు. హెడ్ కానిస్టేబుల్ ఐదుగురు ఉండాలి. కానీ ముగ్గురు మాత్రమే ఉన్నారు. రెండు పోస్టులు ఎప్పటినుంచో ఖాళీగానే ఉంటున్నాయి. కానిస్టేబుళ్లు 29 మంది ఉండాలి. కానీ 24 మంది మాత్రమే ఉన్నారు. 5 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పోలీస్ స్టేషన్ లో మొత్తం 39 మంది సిబ్బంది ఉండాలి. కానీ 31 మంది సిబ్బంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. 8 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇది ఇలా ఉండగా 31 మంది సిబ్బంది లో నిత్యం ఐదుగురు వివిధ రకాల డ్యూటీ పేరుతో బయటే ఉంటారు. వారికే బోనకల్ పోలీస్ స్టేషన్ ముఖం కూడా చూడరు. మిగిలింది 26 మంది సిబ్బంది మాత్రమే. 39 మంది సిబ్బంది నిర్వహించవలసిన విధులను 26 మంది నిర్వహిస్తున్నారు. మండలంలో లో ఇరవై రెండు గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 43 వేల జనాభా ఉంది. పోలీసు భాషలో మండలాన్ని నాలుగు బిట్లుగా విభజించారు ఒక్కొక్క బీట్‌లో నాలుగు నుంచి ఆరు గ్రామాలు ఉన్నాయి 3 సంవత్సరాల క్రితం వరకు బోనకల్ పోలీస్ స్టేషన్‌కు వాహనం లేదు. అప్పటివరకు ఎస్ఐ పోలీస్ సిబ్బంది తమ తమ సొంత ద్విచక్ర వాహనాల ద్వారానే కేసులపై గ్రామాలకు వెళ్లే వారు పెట్రోలింగ్ కూడా అలాగే నిర్వహించేవారు. ప్రస్తుతం వాహనాలు ఉన్న సిబ్బంది కొరత బోనకల్ పోలీస్ స్టేషన్‌ను వేధిస్తుంది. సిబ్బంది కొరతతో ఎస్ఐ కూడా విధుల నిర్వహణలో అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని సందర్భాలలో గ్రామాల నుంచి ఫిర్యాదులు వచ్చిన సమయంలో గ్రామాలకు వెళ్లి విచారణ చేయడానికి కూడా సిబ్బంది కొరత వేధిస్తోంది. శాంతి భద్రతల విషయంలో, పెట్రోలింగ్‌లో, వాహనాల తనిఖీలు సందర్భంగా సిబ్బంది కొరత ప్రభావం ఎస్సై పై పడుతుంది. పోలీసు ఉన్నతాధికారులు ఇప్పటికైనా స్పందించి ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసి పోలీస్ స్టేషన్ సమస్యలను పరిష్కరించాలని మండల ప్రజా ప్రతినిధులు, ప్రజలు కోరుతున్నారు.