Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రమాదకరంగా ఎన్ఎస్పీ బ్రిడ్జి
నవతెలంగాణ- బోనకల్
బోనకల్- చిరునోముల రోడ్డు అత్యంత దారుణంగా ఉంది. ఈ రహదారి పై గల ఎన్ఎస్పీ కాలవపై ఉన్న బిడ్జి అత్యంత ప్రమాదకరంగా ఉంది. ఎప్పుడు బ్రిడ్జి కూలిపోతుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. చిరునోముల బస్ షెల్టర్ నుంచి చిరునోముల వరకు కేవలం రెండు కిలోమీటర్ల దూరం ఉంది. ఈ రెండు కిలోమీటర్ల దూరం కూడా ఆర్అండ్బి పరిధిలో ఉంది. ఉన్నది రెండు కిలోమీటర్ల దూరం అయినప్పటికీ కనీసం రెండు మీటర్ల దూరం కూడా రోడ్డు మంచిగా లేదు. రెండు కిలోమీటర్లు మొత్తం పెద్ద పెద్ద గుంతలతో భయంకరంగా తయారై ఉంది. ద్విచక్ర వాహనాలు నిత్యం ప్రమాదాలకు గురవుతూనే ఉన్నాయి. ఇప్పటికే అనేక ద్విచక్ర వాహనాలకు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. రాత్రి సమయంలో కొత్త వారైతే ప్రమాదానికి గురి కావాల్సిందే. ఆ విధంగా రోడ్డంతా గుంతలు ఏర్పడి ఉన్నాయి. ఈ రహదారి పైనే ఎన్ఎస్పీ కాలవ పై సుమారు 30 ఏళ్ల క్రితం నిర్మించిన బ్రిడ్జి ఉంది. ఈ బ్రిడ్జి ప్రమాదకరంగా మారి శిధిలావస్థలో ఉంది. బ్రిడ్జి దాదాపు 80 శాతం వరకు దెబ్బతిన్నది. ఈ బ్రిడ్జి నుంచి లారీల లాంటి వాహనాలు వెళ్తుంటే బ్రిడ్జి కింద భాగం కదులుతుంది. గ్రామస్తులు అనేకసార్లు ఎన్ఎస్పీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోతుంది. బోనకల్ నుంచి చొప్పకట్లపాలెం వరకు ఈ రోడ్డు ఉన్నప్పటికీ చిరునోముల నుంచి చొప్పకట్లపాలెం వరకు రెండు మూడు చోట్ల మినహా మిగతా రోడ్డంతా మంచిగానే ఉంది. చిరునోములలో 25 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోడౌన్ ఉంది. దీంతో లారీల రాకపోకల రద్దీ బాగా ఉండటంతో ఈ రోడ్డు దెబ్బతిన్నదని గ్రామస్తులు అంటున్నారు. ఖమ్మం నుంచి ఈ రహదారి గుండానే ఆర్టీసీ బస్సు ఆంధ్రాలోని పొలంపల్లి వరకు వెళ్తుంది. ఈ రోడ్డుకు ఎంతో ప్రాధాన్యత కలిగినప్పటికీ ఆర్అండ్బి అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడంలేదని ఆ గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డు, బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.