Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రగళ్లపల్లి లిఫ్టు ఇరిగేషన్‌కు ముఖ్యమంత్రి గ్రీన్ సిగల్..?
- రూ.640 కోట్లు అంచనా వ్యయంతో ప్రతి పాదనలు సిద్ధం
- సశ్యశ్యామలం కానున్న 30 వేల ఎకరాలు సాగు భూములు
నవతెలంగాణ-దుమ్ముగూడెం
దుమ్ముగూడెం మండల గిరిజన, గిరిజనేతర రైతులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న కళ సాకారం కాబోతుందా. ప్రగళ్లనల్లి లిఫ్టు ఇరిగేషన్ ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గ్రీన్ సిగల్ ఇచ్చారా... ఆయన ఆదేశాల మేరకే నీటి పారుదల శాఖ అధికారులు ప్రతి పాదనలు సిద్ధం చేశారా...గోదావరి జళ సిరులతో మండల వ్యాప్తంగా ఉన్న సాగు భూములు సశ్యశ్యామలం కానున్నాయా....వీటన్నిటికీ అవుననే సమాదానాలు ముఖ్యమంత్రి సన్నిహితుల ద్వారా తెలుస్తోంది.
మండల పరిధిలోని సున్నంబట్టి వద్ద ప్రగళ్లపల్లి లిఫ్టు ఇరిగేషన్ ఏర్పాటు చేయాలని భద్రాచలం ఎమ్మెల్యేగా మూడు సార్లు పని చేసిన అమరజీవి సున్నం రాజయ్య దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో గిరిజన భాషలో మాట్లాడి ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు సైతం మన నిధులు, మన నీళ్లు, మన నియామకాలే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం, దేవాదుల లాంటి అనేక సాగు నీటి భారీ ప్రాజెక్టులు నిర్మించి లక్షల ఎకరాల భూములకు సాగు నీరు అందించడమే లక్ష్యంగా పని చేస్తున్నారు. అందులో భాగంగానే దుమ్ముగూడెం గోదావరి నదిపై కాటన్ దొర నిర్మించిన పెద్ద ఆనకట్టకు దిగువ భాగంలో సీతమ్మ సాగర్ బహుళార్ధక సాధక ప్రాజెక్టు నిర్మాణం కోసం శ్రీకారం చుట్టడంతో పాటు పనులు సైతం శరవేగంగా సాగుతున్నాయి. సీతమ్మ సాగర్ ప్రాజెక్టు నిర్మాణంతో గోదావరి బ్యాక్ వాటర్‌తో మండలంలో ఉన్న అన్ని గ్రామాలకు సాగు నీరు అందించవచ్చని తన సన్నిహితుల ద్వారా ఇక్కడ పరిస్థితులు తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ప్రతి పాదనలు సిద్ధం చేయాలని సాగునీటి అధికారులను ఆదేశించారు. దీంతో సాగు నీటి ఇంజనీర్ల బృందం మండలంలో పర్యటించి ప్రతి పాదనలు సిద్ధం చేయడంతో పాటు రూ.640 కోట్ల నిధులు అంచనా వ్యయంగా ఫైల్‌ను ముఖ్యమంత్రి వద్దకు పంపినట్టు సమాచారం. త్వరలో ముఖ్యమంత్రి సైతం ఫైల్‌పై సంతకం చేసి అధికారిక ప్రకటన చేస్తారని సమాచారం.
సాగులోకి రానున్న 30 వేల ఎకరాలు : సున్నం బట్టి వద్ద ప్రగళ్లల్లి లిఫ్టు ఇరిగేషన్ ఏర్పాటు వలన మండల వ్యాప్తంగా సుమారు 30 వేల ఎకరాల భూములకు సాగు నీరు అందించే విధంగా సాగునీటి అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. దీంతో పాటు తాలిపేరు ఆయకట్టు కింద సుమారు 12 వేల ఎకరాలు ఈ పధకం ద్వారా స్తిరీకరణ జరగనుంది. సున్నంబట్టి వద్ద ఏర్పాటు చేసిన లిఫ్టు ఇరిగేషన్ నుండి పెద్ద కమలాపురం, జెడ్ వీరభద్రవరం వరకు పైపు లైన్ ఏర్పాటు చేస్తారు. అక్కడ ఏర్పాటు చేసిన డిస్ట్రి బూటర్స్ నుండి ఫ్రెషర్ గన్ల ద్వారా కాలువల నుండి నీరు వదిలి మండలంలోని సుమారు 80 చెరువుల్లోకి నీటిని వదులుతూ పంట పొలాలకు నీరు అందిస్తారు. పెద్ద కమలాపురం, జడ్ వీరభద్రవరంలో ఎర్పాటు చేసిన డిస్ట్రిబ్యూటర్ నుండి కొత్తపల్లి, పైడి గూడెం వరకు పైపులు ఏర్పాటు చేసి ఫ్రెషర్ గన్ల ద్వారా చుట్టు పక్కల గ్రామాలకు కాలువల ద్వారా నీరు అందించనున్నారు. ఏది ఎమైనా ప్రగళ్లపల్లి లిఫ్టు ఏర్పాటు వలన వేల ఎకరాల బంజరు భూములు, సాగు భూములు సాగులోకి రావడంతో పాటు మండల రైతుల సాగు నీటి ఇబ్బందులు తొలగి రైతుల ఇంట సిరులు కురుస్తాయనే చెప్పవచ్చు.