Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హరి భూషణ్ మృతిని ధ్రువీకరించని మావోయిస్టులు
ఖమ్మం నవతెలంగాణ
సరిహద్దు ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా సరిహద్దు మీనాగట్టలో మౌనం తాండవిస్తోంది. మావోయిస్టు రాష్ట్ర కమిటీ కార్యదర్శి హరి భూషణ్ అలియాస్ లక్మాదాదా, అలియాస్ జగన్, అలియాస్ యాపా నారాయణ ఈ నెల 21న మృతి చెందినట్లు సోషల్ మీడియాతో పాటు ప్రధాన పత్రికల్లోనూ, టీవీ ఛానల్లో వచ్చిన కథనాల ఆధారంగా చర్ల మండలం పాత్రికేయ బృందం అత్యంత దండకారణ్య ప్రాంతమైన మీనగట్ట ప్రయాణమై సరిహద్దు పామేడు నుండి బయలుదేరి కర్ర తొట్టిలో ప్రయాణం చేసి చింత వాగు, దాటి ధర్మారం మీదుగా, ఉడత మల్ల, కంచల ఆదివాసీ గ్రామాలను దండకారణ్యంలో వాగులూ వంకలూ దాటి వర్షాన్ని సైతం లెక్కచేయకుండా మీనగట్ట చేరుకుంది. ఆ ప్రాంత ప్రజలు ఇచ్చిన సమాచారం వార్తా కథనానికి పూర్తిగా భిన్నంగా ఉంది. ఆ అరణ్యప్రాంతంలో అటువంటి సంఘటన ఏమీ జరగలేదని వారు వాపోయారు. పాత్రికేయ బృందం ఆ ప్రాంత ప్రజల యోగ సమాచారాలు కనుక్కొని విద్య, వైద్యంపై చర్చించి తిరుగు ప్రయాణమైంది.
హరి భూషణ్ మృతుని దృవీకరించని మావోయిస్టులు
చోటామోటా సంఘటనలకు స్పందించి లేఖల ద్వారా పాత్రికేయులకు సమాచారం అందించే మావోయిస్టు పార్టీ మూడు రోజులు గడిచినా ఇప్పటి వరకు మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ కార్యదర్శి, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు, కేంద్ర కమిటీ సభ్యుడు అయిన హరి భూషణ్ మరణవార్తపై సందిగ్ధతను మావోయిస్టు పార్టీ ఇప్పటి వరకు తీర్చలేదని పలువురు విశ్లేషిస్తున్నారు. సుమారు 5 రాష్ట్రాల పోలీసులను ముప్పతిప్పలు పెట్టి రూ.40 లక్షల రివార్డు కలిగి లక్మా దాదాగా అరణ్యంలో మావోయిస్టు పార్టీలో మూడు దశాబ్దాలుగా పనిచేసే ఆయనపై వచ్చిన మరణవార్తను మావోయిస్టు పార్టీ సేదించలేక పోవడానికి కారణాలు ఏమిటని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆయన మరణించాడని తెలిపితే మావోయిస్టు పార్టీకి ఉన్న బలం తగ్గి డీలా అవుతుందని గోప్యంగా ఉంచుతోందని కొందరు విశ్లేషిస్తున్నారు.
మృతి చెందాడు అంటున్న పోలీసులు
మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శి హరి భూషణ్(52) మృతి చెందినట్లు ఇటు తెలంగాణ, అటు ఛత్తీస్గఢ్ పోలీసు ఉన్నతాధికారులు దృవీకరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్ దత్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి మృతి చెందినట్లు తెలిపారు. బస్తర్ ఐజి సుందర్ రాజ్ పి సైతం బీజాపూర్, సుకుమా జిల్లాల సరిహద్దు గ్రామాలు అయిన మీనగట్ట, జబ్బగట్ట, బట్టి గూడెం సమీప దండకారణ్యంలో హరి భూషణ్కు కరోనా వ్యాధి సంక్రమించి మృతిచెందాడని ఆయనతో పాటు ఆయన భార్య శారద అలియాస్ సమ్మక్కతో పాటు మరికొందరు కరోనా మహమ్మారి సోకి అస్వస్థకు గురవుతున్నారని పాత్రికేయులకు తెలుపుతున్నారు.
- ఉత్కంఠగా దండకారణ్యం
పచ్చని అడువులతో నిశ్శబ్దంగా ఉండే దండకారణ్య ఆదివాసీ గ్రామాల్లో లక్ష్మా దాదా మృతిచెందాడని విషయం ఆ నోటా ఈ నోటా తెలియడంతో అసలేం జరిగిందో తెలియక దండకారణ్యం అంతా ఉత్కంఠభరితంగా ఉంది.