Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీసీ ఫుటేజ్ ఆధారంగా గుర్తింపు
- వివరాలు తెలిపిన త్రీ టౌన్ సీఐ వేణు చందర్
నవతెలంగాణ-కొత్తగూడెం
బంగారం దొంగతనం చేసిన ఐదుగురు మహిళా దొంగలను అదుపులోకి తీసుకున్నట్టు కొత్తగూడెం త్రీ టౌన్ సీఐ డి.వేణు చందర్ వివరాలను వెల్లడించారు. కొత్తగూడెం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిన్న బజార్లోని శ్రీ నిధి జ్యుయులరీ దుకాణంలో ఈనెల 23న బుధవారం ఐదుగురు మహిళలు రూ.60 వేలు విలువ గల రెండు జతల చెవి దిద్దులను దొంగిలించారు. షాపు యజమాని ఫిర్యాదు కొత్తగూడెం 3టౌన్ పోలీసులు వెంటనే దర్యాప్తును ప్రారంభించారని తెలిపారు. బంగారు నగల దుకాణంలోని సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దొంగతనానికి పాల్పడిన ఆ అయిదుగురు మహిళలను గుర్తించి వారి కోసం గాలింపు చర్యలు చేపట్టామని తెలిపారు. దొంగతనానికి పాల్పడిన మహిళలు కొత్తగూడెం బస్టాండ్ పరిసరాలలో సంచరిస్తున్నట్టు సమాచారాన్ని అందుకున్న త్రీ టౌన్ పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు. తదుపరి వారిని కొత్తగూడెం 3 టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించి విచారణ చేపట్టి ''ఫింగర్ ప్రింట్ స్కానర్'' ద్వారా వారి వేలి ముద్రలను సేకరించగా వీరిపై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో 25 కేసులు నమోదాయినట్లు తేలిందని సీఐ వెల్లడించారు. పట్టుబడిన ఐదుగురు మహిళల వివరాలు తెలిపారు. గుగులోత్ గోబీ, భూక్యా బుల్లి, భూక్యా మంగతి, భూక్యా అంకు, భూక్యా సీత, ఉన్నారు. వీరంతా మహబూబాబాద్ జిల్లాలోని మంగమడుగు, నరసింహులుపేటలోని ఫకీరాతండాకి చెందిన వారుగా గుర్తించడం జరిగిందన్నారు. వరంగల్, మహబూబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జనగామ, ఖమ్మం, సిద్దిపేట జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో గల బంగారు నగల దుకాణాలు, బట్టల దుకాణాలకు వెళ్లి దుకాణదారుల దృష్టిని మళ్లించి బంగారు ఆభరణాలను, బట్టలను దొంగిలించినట్లుగా విచారణలో తేలిందని సిఐ తెలిపారు. పట్టుబడిన వారి నుండి దొంగిలించి సొత్తు రెండు జతల చెవి దిద్దులను స్వాధీనం చేసుకుని రిమాండ్ నిమిత్తం కోర్ట్నకు తరలించడం జరిగిందని తెలియజేశారు. తక్షణమే స్పందించి సాంకేతికతను ఉపయోగించి నిందితులను అదుపులోకి తీసుకొని కేసును ఛేదించిన త్రీటౌన్ సీఐ వేణుచందర్, సిబ్బందిని జిల్లా ఎస్పీ సునీల్ దత్ అభినందించారు.