Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అజెండాలోని మిగతా అంశాలకు ప్రాధాన్యత తక్కువ
- ఇదీ జడ్పీటీసీ సర్వసభ్య సమావేశం తీరు
నవతెలంగాణ- కొత్తగూడెం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జడ్పీ సర్వసభ్య సమావేశం సాదాసీదాగా సాగింది. ఎజెండాలో పొందుపరిచిన ప్రధాన అంశాలను పక్కకు పెట్టి పోడు భూముల అంశం మీదనే చర్చ కొనసాగింది. అటవీశాఖ అధికారులు, రెవెన్యూ శాఖ అధికారుల మధ్య సమన్వయం లేకనే పోడు భూముల సమస్య జిల్లాలో రగులుతుందని, ప్రభుత్వం అటవీ శాఖ అధికారులకు పోడు సాగు దారులు విషయంలోకి వెళ్లవద్దని పట్టా భూములలో ట్రెంచ్ కొట్టవద్దని చెప్పినప్పటికీ అటవీశాఖ అధికారులు అతి ఉత్సాహం ప్రదర్శిస్తున్నారని జిల్లా పరిషత్ చైర్మెన్ కోరం కనకయ్య, ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం కొత్తగూడెం క్లబ్లో మధ్యాహ్నం ప్రారంభమైంది. జిల్లా జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రభుత్వ విప,్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు సభలో ప్రజా ప్రతినిధులు అడిగిన సమస్యలపై అటవీ శాఖ, ఐటీడీఏ అధికారులను నిలదీశారు. ముఖ్యంగా ఐటీడీఏ పరిధిలోని గిరిజన ఆదివాసీ గ్రామాలలో ఐటీడీఏ నుండి సంక్షేమం ఏమి అందిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా, ఇతర వ్యాధులతో ఆదివాసీ గిరిజనులు మృత్యువాత పడుతుంటే ఐటీడీఏ వెల్ఫేర్ విభాగం నిద్రపోతోందా...? అని ప్రభుత్వ విప్ మండిపడ్డారు. ఆదివాసీల కోసం ఏర్పాటుచేసిన ఐటీడీఏ వారికోసం పనిచేయనప్పుడు ఆ విభాగం ఎందుకు... దాన్ని మూసివేయండి అంటూ అసహనం వ్యక్తం చేశారు.
అటవీశాఖ అధికారులు పోడు సాగుదారుల పట్ల అతి ఉత్సాహం ప్రదర్శించి ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఉన్న భూములను ఆదివాసులు ఉండి లాక్కోవడం సరికాదని హెచ్చరించారు. హరితహారం ప్లాంటేషన్ కోసం గిరిజనుల భూములే ఉన్నాయా... అన్నారు. వెంటనే రెవెన్యూ, అటవీ శాఖ అధికారు ప్రత్యేక కమిటీ ఏర్పడి జాయింట్ సర్వే నిర్వహించాలని ఆదేశించారు. జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ మెరుగైన సేవలు అందించాలని అందుకు జిల్లాలోని ప్రజా ప్రతినిధులు, అధికారులు పూర్తి సహకారం అందించారని అభినందించారు. కోవిడ్ సెకండ్ వేవ్ నివారణకు ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది చేసిన కృషి అభినందనీయమన్నారు. జిల్లాకు రాష్ట్ర ముఖ్యమంత్రి జూలై ఒకటో తేదీ తర్వాత ఎప్పడైనా వచ్చే అవకాశం ఉన్నదని, ఏ గ్రామం అయినా ఆకస్మికంగా సందర్శించే అవకాశం ఉన్నం దున ప్రతి గ్రామం పల్లెప్రగతి అంశాలు పూర్తిచేయాలని, హరితహారం కార్యక్రమం సక్రమంగా నిర్వహించాలని, పారిశుధ్య పనులు చేయాలని ఆదేశించారు. ఇప్పటి వరకు జిల్లాలోని 38 పాఠశాలు కోవిడ్ ఐసోలేషన్ కేంద్రాలుగా ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. పాఠశాలలు తెరిచే అవకాశం ఉన్నందున వాటిని శానిటేషన్ చేసి విద్యా శాఖకు అప్పగించాలని సూచించారు. ఈ సమావేశంలో జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్ రావు, అదనపు కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు, గ్రంధాలయ చైర్మన్ దిండిగాల రాజేందర్, జడ్పీ సీఈవో ఎం.ఆశాలత, డిప్యూటీ సీఈఓ, జిల్లా అధికారులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు తదితరులు పాల్గొన్నారు.