Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బోనకల్
యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరులో ఒక దొంగతనం కేసు విషయమై విచారణ సందర్భంగా పోలీసులు విచక్షణా రహితంగా కొట్టడంతో లాకప్ లో మరణించిన మరియమ్మ కేసు విషయంలో చింతకాని, కొణిజర్ల పోలీసులపై కూడా చర్యలు తీసుకోవాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు, యువ న్యాయవాది తోట రామాంజనేయులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బోనకల్ మండల కేంద్రంలో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ విచారణ పేరుతో పోలీసులు విచక్షణ రహితంగా కొట్టడం పరిపాటి అయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. భారతీయ శిక్షాస్మృతి ఐపీసీ ప్రకారం నేరం మోపబడిన వ్యక్తిపై దురుసుగా ప్రవర్తించ కూడదని, కొట్టడం, తిట్టడం లాంటివి చేయకూడదని స్పష్టంగా ఉందన్నారు. అలా చేసినా వారిపై, వాళ్లకు సహకరించిన వారిపై ఐపీసీ సెక్షన్ 330, సెక్షన్ 331 ప్రకారం పోలీసులపై కేసు నమోదు చేయవచ్చని ఆయన తెలిపారు. అడ్డగూడూరు పోలీసులు 16వ తారీకు అర్ధరాత్రి సమయంలో చింతకాని మండలం కోమట్లగూడెంలో చింతకాని పోలీసుల సమక్షంలోనే మరియమ్మను ఆమె కుమారుడిని హింసించారన్నారు. ఆ తరువాత కొణిజర్లలో ఉన్న మరియమ్మ కుమార్తె దగ్గరకు వెళ్లి కొణిజర్ల మండలం పోలీసుల సమక్షంలో మరియమ్మ, ఆమె కుమార్తెను కొట్టి హింసించారన్నారు. ఈ హింసకు ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించిన చింతకాని, కొణిజర్ల మండలాల పోలీసులపై కూడా కేసు నమోదు చేసి వారిపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై వైరా ఏసీపీ, ఖమ్మం డీసీపీలకు ఫిర్యాదు చేస్తామని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో సీపీఐ బోనకల్లు మండల కార్యదర్శి యంగల ఆనందరావు పాల్గొన్నారు