Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బాధిత కుటుంబానికి రూ.60వేల సాయం
నవతెలంగాణ-నేలకొండపల్లి
ఆపదలో ఆదుకున్న వారే నిజమైన మిత్రులని వారు మరోసారి నిరూపించారు. తమ మిత్రుడు అనారోగ్యంతో మరణించడంతో విషయం తెలుసుకున్న మిత్రబృందం షాక్కు గురయ్యారు. జరిగిన ఘటనపై వారు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అప్పటివరకు తమతో కలిసి తిరిగిన మిత్రుడు ఒక్కసారిగా లేడు అనే విషయాన్ని వారు జీర్ణించుకోలేకపోయారు. అనుక్షణం వారిని తీవ్ర మానసిక వేదనకు గురి చేసింది. ఎలాగైనా మిత్రుడి కుటుంబాన్ని ఆదుకోవాలని ఆలోచనతో తోటి మిత్రులంతా ఒక నిర్ణయానికి వచ్చారు. ఆలోచన వచ్చిందే తడవుగా అందరూ ఒక్కటై చేయూత నందించారు. వివరాల ప్రకారం... మండలంలోని కోరట్లగూడెం గ్రామానికి చెందిన వెలిశాల నాగేశ్వరరావు అమ్ముడు దంపతుల కూతురు రమాదేవికి ఖమ్మం ఖానాపురంహవేలికి చెందిన దేవరకొండ నరసింహారావుతో 12 సంవత్సరాల క్రితం వివాహమైంది. వారికి అక్షరు కుమార్, సురేందర్ కుమార్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. అప్పటివరకు అన్యోన్యంగా గడిపిన ఆ కుటుంబంలో ఒక్కసారిగా విషాదం అలుముకుంది. ఇటీవలే భర్త అనారోగ్యంతో మరణించాడు. భర్తను కోల్పోయిన రమాదేవి ఇద్దరు పిల్లలతో తల్లిదండ్రుల వద్దకు వచ్చి కూలి నాలి చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఈ విషయం నరసింహారావు మిత్రులను తీవ్రంగా కలిచివేసింది. ఎలాగైనా ఆ కుటుంబానికి ఆసరాగా చేయూతను అందించి అండగా నిలవాలని అనుకున్నారు. 16 మంది మిత్రులు కలిసి రూ.60 వేలు జమ చేశారు. శనివారం కోరట్లగూడెం గ్రామానికి విచ్చేసి వారి ఇద్దరు కుమారుల పేరు మీద స్థానిక పోస్ట్ ఆఫీస్ లో ఒక్కొక్కరికి 30 వేల చొప్పున 10 సంవత్సరాలు డిపాజిట్ చేశారు. అట్టి సొమ్మును బాధిత కుటుంబానికి అందజేయడంతో పాటు రోజువారి ఖర్చుల నిమిత్తం 2000 రూపాయల నగదుతో పాటు మరో అరక్వింటా బియ్యం అందజేశారు. ఈ కార్యక్రమంలో నరసింహారావు మిత్రులు షేక్ నాగుల్ మీరా, వంకాయలపాటి సంజరు, ఎర్రంశెట్టి నరసింహారావు, రమాదేవి తల్లిదండ్రులు పాల్గొన్నారు.