Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నత్తనడకన నిర్మాణ పనులు
- పట్టించుకోని జిల్లా ప్రజాప్రతినిధులు
నవతెలంగాణ-పాల్వంచ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత ప్రజలకు అందుబాటులో ఉండేలా జిల్లా అధికారుల కార్యాలయాలు అన్ని ఒకేచోట నిర్మించాలనే ఉద్ధేశంతో ప్రభుత్వం తలపెట్టిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ నూతన నిర్మాణ పనులు నత్తనడకన నడుస్తున్నాయి. శంఖుస్థాపన చేసి మూడేళ్లు గడుస్తున్నా నిర్మాణాలు పూర్తికాకపోగా ప్రభుత్వం నుండి రావాల్సిన నిధులు రాకపోవడంతో నిర్మాణంలో తీవ్ర జాప్యం నెలకొంది. జిల్లా మంత్రి, కలెక్టర్ పలుమార్లు స్వయంగా పరిశీలించి సమీక్షలు జరిపినా ముందుకు సాగడం లేదు. ఇతర జిల్లాలో నిర్మాణాలు పూర్తి చేసుకుని ఇటీవల జిల్లా కలెక్టరేట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభోత్సవాలు చేశారు. అక్కడ ఉన్న ఇచ్చార్జి మంత్రులు, ప్రజా ప్రతినిధులు చురుగ్గా నిర్మాణ పనులపై దృష్టి పెట్టడంతో పూర్తి అయినా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మాత్రం ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వెలువెత్తుతున్నాయి. ప్రభుత్వం నుండి నిధులను మంజూరు చేయించి త్వరితగతిన నిర్మాణం జరిగేలా కృషి జరగడం లేదని అందుకే ఈ ఆలస్యానికి కారణం అని ఇతర పార్టీ నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఆగమేఘాలపై కలెక్టరేట్ సమీకృత భవన సముదాయాల కోసం కొత్తగూడెం పాల్వంచ మధ్య జాతీయ రహదారి పక్కన యూనివర్సీటీ కాలేజి ఆఫ్ ఇంజరనీరింగ్ కళాశాలకు చెందిన 2518 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం మైనింగ్ కాలేజి యాజమాన్యం నుండి పాల్వంచ రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకుని ఆర్‌ఆండ్‌బీ అధికారులకు అప్పగించారు. ఈ కలెక్టరేట్ భవన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం సాధారణ ప్రణాళిక నిధులు రూ.44.98 కోట్లు మంజూరు చేసింది. ఈ భవనాలు జి ప్లస్2 కాంప్లెక్స్‌లుగా నిర్మించనున్నారు. ఈ భనవ నిర్మాణానికి గత 3 సంవత్సరాల క్రితం హైదరాబాద్‌కు చెందిన కేసీపీ ప్రాజెక్టు ప్రైయివేటు లిమిటెడ్ అధిక ధరకు కోడ్ చేసి పనులు దక్కించుకున్నారు. 2018 జనవరిలో ఈ అగ్రిమెంట్ చేసుకున్నారు. సంవత్సరంలో పనులు పూర్తి చేయాల్సిన నిబంధన ఉండగా 3 ఏళ్లు గడిచినా నిధుల జాప్యంతో నత్తనడకన నడుస్తున్నాయి. ప్రస్తుతం 80 శాతం పనులు పూర్తికాగా 20 శాతం పనులు చేయాల్సి ఉంది. నిధులు లేకపోవడంతో పనులు నిలిపివేసినట్టు తెలుస్తుంది. దీనికి తోడు కలెక్టరేట్ భవనం ప్రారంభం అయిన మొదట్లో పనులు కొంత వేగంగా సాగినా తర్వాత భారీ వర్షాలు కరోనా మహమ్మారీ ప్రభావం కారణంగా నిర్మాణంలో జాప్యం జరిగింది. ప్రస్తుతం ఎలక్ట్రికల్, డ్రైనేజి, ప్రహారీ, గార్డెనింగ్, గదులలో టైల్స్, ఫర్నీచర్, మొదలగు పనులు చేయాల్సి ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం నుండి నిధుల మంజూరులో జాప్యం కావడంతో గుత్తేదారు పనులు చేపట్టడంతో ఆలస్యం జరుగుతుంది. ఇప్పటికీ జిల్లా అధికారులు ఈ భవనం ఎప్పుడు అందుబాటులోకి వస్తుందని స్పష్టంగా చెప్పలేపోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లా కలెక్టరేట్లు పూర్తి అయి ప్రారంభించుకున్న నేపధ్యంలో జిల్లాలో కలెక్టరేట్ ఎప్పుడు ప్రారంభం అని ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా మంత్రి, ప్రజా ప్రతినిధులు కలెక్టరేట్ నూతన భనవ నిర్మాణానికి కృషి చేసి త్వరలో ప్రారంభించుకోవడానికి ప్రయత్నించాలని ప్రజలు కోరుతున్నారు.