Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర డీజీపి మహేందర్ రెడ్డి
నవతెలంగాణ-ఖమ్మం
ప్రజా నమ్మకమే ఆధునిక పోలీస్ వ్యవస్థకు పునాది అని రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. అడ్డగూడురు పోలీస్ స్టేషన్ ఘటనలో ఖమ్మం నగరంలోని సంకల్ప ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఉదరు కిరణ్ పరామర్శించేందుకు రాష్ట్ర డీజీపీ, నార్త్ జోన్ ఐజీపీ వై.నాగిరెడ్డి తో కలసి ఆదివారం హెలికాప్టర్ లో జిల్లాకు చేరుకున్నారు. జిల్లా కలెక్టర్ ఆర్వి. కర్ణన్, పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ కలసి సంకల్ప ఆసుపత్రిలో బాధితుడిని పరామర్శించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడారు.
అనంతరం జిల్లాలోని ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్, త్రీ టౌన్ పోలీస్ స్టేషన్, కొణిజర్ల పోలీస్ స్టేషన్, పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఎంట్రీ సెక్షన్‌ను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ సిబ్బందితో మాట్లాడుతూ ప్రజల ఆశయాలకు అనుగుణంగా వారి ఆత్మగౌరవానికి భంగం కలగకుండా నిష్పక్షపాతంగా సేవలందించాలని అన్నారు. నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజామోదం లభించటం ద్వారానే విధినిర్వహణ సామర్థ్యం ఆధారపడి ఉంటుందని తెలిపారు. పోలీసు శాఖపై ప్రజలకు విశ్వాసం పెరిగిననాడే నేరాలను పూర్తిస్థాయిలో అదుపు చేయవచ్చునని అన్నారు. రక్షణ కోసం వచ్చిన బాధ్యతల పట్ల మానవీయ కోణంలో వేగంగా స్పందించి సమస్యను పరిష్కరించే దిశగా కృషి చేయాలని అన్నారు. 14 ఫంక్షనల్ వర్టికల్స్, 5 ఎస్ విధానాన్ని , లీడర్ షిప్ క్వాలిటీ అమలు తీరును అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్ లో పని చేస్తున్న ప్రతిఒక్కరికి పని విభజన చేసి ఖచ్చితమైన బాధ్యతలు అప్పగించటం జరిగిందని, తమకు అప్పగించిన పని తానే చేయాలనే తపనతో జవాబుదారీ తనం వ్యక్తిగత సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు.
పోలీస్ స్టేషన్ లో రిసెప్షన్ స్టాప్, స్టేషన్ రైటర్స్, క్రైమ్ రైటర్స్, బ్లూ కోల్ట్స్, పెట్రోలింగ్ కార్, కోర్టు డ్యూటీ ఆఫీసర్ , టెక్నికల్ టీమ్, క్రైమ్ స్టాప్ తదితర విభాగాలలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని వారి యొక్క విధివిధానాలను ఒక్కరిని అడిగి తెలుసుకున్నారు.
రూరల్ పోలీస్ స్టేషన్లో డీజీపీ మహేందర్ రెడ్డి
ఖమ్మం రూరల్ : ఖమ్మం పర్యటనకు వచ్చిన డీజీపీ మహేందర్ రెడ్డి ఆదివారం ఆకస్మికంగా ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ ను సందర్శించారు. పోలీసు స్టేషన్ పరిసరాలను మొత్తం పరిశీలించారు. రికార్డులను పరిశీలించి కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు జరుగుతున్న తీరు గురించి ఆరా తీశారు. కేసులు పెండింగ్‌లో లేకుండా చూడాలన్నారు. పోలీసుల విధులు, లక్ష్యాల గురించి తెలుసుకోవాలని సిబ్బందికి సూచించారు. పోలీసు స్టేషన్ లో సీసీ కెమోరాలను పరిశీలించారు. స్టేషన్ మొత్తం పచ్చదనం, పరిశుభ్రంగా ఉండేలా చూడాలన్నారు. ఫిర్యాదు దారులకు అండగా ఉండి వారి సమస్యలను పరిష్కరించాలన్నారు. కేసుల విచారణలో జాప్యం చేయరాదని సూచించారు. అనంతరం ఖమ్మం రూరల్ సర్కిల్ కార్యాలయాన్ని సందర్శించి రికార్డులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఐజీ నాగిరెడ్డి, సీపీ విష్ణు ఎస్. వారియర్, అడిషనల్ డీసీపీ బోసు, ఏసీపీలు వెంకటరెడ్డి, రామాంజనేయులు, సీఐ సత్యనారాయణ రెడ్డి, ఎస్ఐ శంకరరావు, సిబ్బంది పాల్గొన్నారు.
బాధితులకు మెరుగైన సేవలందిచాలి
కొణిజర్ల : న్యాయం కోసం పోలీస్‌స్టేషన్‌కు బాధితులు వస్తే మెరుగైన సేవలందిందుకు కృషి చేయాలని డీజీపీ మహేందర్ స్పష్టం చేశారు. స్థానిక పోలీస్‌స్టేషన్ ను ఆదివారం ఆయన సందర్శంచారు. తొలుత స్థానిక పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. కేసులకు సంబంధించిన వివిధ రకాల రికార్డులను తనిఖీ చేశారు. ఇప్పటి వరకు ఫిర్యాదు దారులకు అందుతున్న సేవల గురించి పోలీసులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ మంచి పేరు రావాలంటే నిష్పక్షపాతంగా ప్రజలకు మంచి సేవలందించాలన్నారు. స్టేషన్‌కు వచ్చే వారిపట్ల మర్యాదగా వ్యవహరించలన్నారు. ఈ కార్యక్రమంలో డీసీపీ పూజ, సీపీ విష్ణు వారియర్, ఏసీపీ సత్యనారాయణ, సీఐ వసంత కూమార్, ఎస్ఐ రవి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.