Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 34 ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలు
నవతెలంగాణ-బోనకల్
మండలం పరిధిలోనే అనేక ప్రభుత్వ పాఠశాలలు సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నాయి. గత సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలలు కరోనా దెబ్బకు విలవిల లాడుతున్నాయి. గత విద్యా సంవత్సరం దాదాపుగా మూత పడినట్లే. కొద్దిరోజులు మాత్రమే పాఠశాలలు పని చేశాయి. 2020 మార్చి 25న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించాయి. 2021లో సుమారు రెండు నెలలపాటు పాటు మాత్రమే పాఠశాలలు తెరుచుకున్నాయి. రెండవ దశలో కరోనా మరల విజృంభించడంతో ప్రభుత్వ పాఠశాలలను మరల మూసివేశారు. 2021-2022 విద్యా సంవత్సరం ఈ నెలలో ప్రారంభం కావాల్సి ఉంది. కానీ కరోనా దెబ్బకు ఇంకా ప్రారంభం కాలేదు. కరోనా దెబ్బకు విద్యా సంవత్సరం కకా వికలమై ముగిసింది. ప్రస్తుత విద్యా సంవత్సరం కూడా సక్రమంగా జరుగుతుందో లేదో కూడా తెలియని అనిశ్చిత పరిస్థితి నెలకొని ఉంది. కరోనా ఎఫెక్ట్ ఇలా ఉండగా విద్యారంగంపై ప్రభుత్వ పనితీరు కూడా అత్యంత దారుణంగా ఉంది.
మండలంలో పది ఉన్నత పాఠశాలలు, 32 ప్రాథమిక పాఠశాలలు, ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి ఉంది. మొత్తం 43 పాఠశాలలు ఏదో ఒక సమస్యతో కొట్టుమిట్టాడుతూనే ఉన్నాయి. మండలంలోని 43 పాఠశాలలకు గాను 202 ఉపాధ్యాయ పోస్టులు ఉండాలి, కానీ 168 పోస్టులలో మాత్రమే ఉపాధ్యాయులు ఉన్నారు. మిగిలిన 34 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పది ఉన్నత పాఠశాలలో 112 మంది ఉపాధ్యాయులు పని చేయవలసి ఉంది. కానీ 88 మంది మాత్రమే ఉపాధ్యాయులు ఉన్నారు. మిగిలిన 24 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మండలంలో అత్యధికంగా మోటమర్రి ఉన్నత పాఠశాలలో తొమ్మిది మంది ఉపాధ్యాయులకు గాను ముగ్గురు మాత్రమే ఉపాధ్యాయులు ఉన్నారు. మిగిలిన ఆరు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పాఠశాలలో విద్యా బోధన ఎలా జరుగుతుందో ఈ పోస్టులు బట్టే మనకు అర్థం అవుతుంది. గోవిందపురం ఎల్ ఉన్నత పాఠశాలలో 12 మంది ఉపాధ్యాయులు ఉండవలసి ఉండగా ఏడుగురు మాత్రమే ఉన్నారు. మిగిలిన 5 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మండల కేంద్రమైన బోనకల్ ఉన్నత పాఠశాలలో 14 మంది ఉపాధ్యాయులకు గాను 11 మంది మాత్రమే ఉన్నారు. మిగిలిన మూడు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఉపాధ్యాయ పోస్టులు ఈ విధంగా ఖాళీగా ఉంటే విద్యా బోధన ఎలా ఉంటుందో మనకు అర్థమవుతుంది. బోనకల్ ఉన్నత పాఠశాల కాంప్లెక్స్ పరిధిలో గల ప్రాథమిక పాఠశాలలో 28 మంది ఉపాధ్యాయులకు గాను 24 మంది మాత్రమే ఉన్నారు. మిగిలిన నాలుగు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జానకిపురం కాంప్లెక్స్ పరిధిలో 29 మంది ఉపాధ్యాయులకు 27 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. కలకోట కాంప్లెక్స్ పరిధిలో 33 మంది ఉపాధ్యాయులకు 29 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. మిగిలిన నాలుగు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం పోస్టులు ఆరు ఖాళీగా ఉన్నాయి. మూడు ఎస్జిటి పోస్టులు, ఒకటి ఎస్ఏ పోస్ట్ ఖాళీగా ఉంది.
ఉపాధ్యాయ పోస్టుల పరిస్థితి ఇలా ఉండగా అనేక పాఠశాలలు తరగతి గదుల కొరత, టాయిలెట్స్, ప్రహరీ గోడలు, వంట గదుల కొరతతో కునారిల్లు తున్నాయి. మండలంలోని 43 పాఠశాలలకు చెందిన విద్యార్థులకు 22 వేల 077 పాఠ్య పుస్తకాలు ప్రభుత్వం ఇవ్వవలసి ఉంది. కానీ నేటి వరకు ఒక్క పుస్తకం కూడా మండలానికి చేరుకోలేదు. ఈ విధంగా మండలంలోని ప్రభుత్వ పాఠశాలలు వివిధ సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. ఈ విద్యా సంవత్సరం లో నైనా ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ విద్యా బోధన సక్రమంగా జరిగే విధంగా చేయాలని టీఎస్ యుటీఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి గుగులోతు రామకృష్ణ మండల అధ్యక్షుడు కంభం రమేష్ ప్రభుత్వాన్ని కోరారు.