Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బిక్కుబిక్కుమంటున్న ప్రజలు
నవతెలంగాణ-బోనకల్
జనావాసాల మీదుగా హైటెన్షన్ విద్యుత్ వైర్లు ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. మండల పరిధిలోని కలకోట గ్రామంలో 33/11ల హైటెన్షన్ విద్యుత్ వైర్లు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. వర్షాకాలం వచ్చిందంటే ప్రజల వెన్నులో వణుకు పుడుతుంది. ఏ క్షణంలో ఏం జరుగుతుందో అన్న భయాందోళనలో కలకోట గ్రామంలోని రెండు దళిత కాలనీ వాసులు ఆందోళన చెందుతూ ఉన్నారు. టీ జంక్షన్ వద్ద వారంలో ఒకటి రెండుసార్లు విద్యుత్ తీగలు మీద పక్షులు వాలడం వల్ల జరిగే ప్రమాదాలతో ఇండ్లల్లో ఫీజులు కొట్టేస్తున్నాయి. దీంతో ఎప్పుడు ఏమి ముంచుకొస్తుందో అన్న ఆందోళనలో ప్రజలు ఉంటున్నారు.
మండలంలోని కలకోటలో రెండు దళిత కాలనీలు గతంలో రాళ్లవాగు ఒడ్డున ఉండేవి. ప్రకృతి వైపరీత్యం వల్ల 1961లో వచ్చిన తుఫానుకు కలకోట పెద్ద చెరువు అలుగు పొంగి ఇళ్లు కొట్టుకుపోయిన సందర్భంలో నిరాశ్రయులైన కాలనీ వాసులకు సమీప బస్టాండ్ నుంచి రాళ్లవాగు మధ్యగల బీడు భూమిని ప్రభుత్వం ప్లాట్లు చేసి నిరాశ్రయులకు ఆవాసం క్రింద పంపిణీ చేసింది. అప్పటికే ఈ బీడు భూమి గుండా 33 /11 విద్యుత్తు హై టెన్షన్ కనెక్షన్ లైను ఉంది. అయినప్పటికీ నిలువ నీడ కోసం నిరాశ్రయులైన ప్రజలు ప్రభుత్వం ఇచ్చిన స్థలాలలోనే తాత్కాలిక ఇల్లు నిర్మాణం చేసుకున్నారు. అనతికాలంలోనే ప్రభుత్వం వారికి పక్కా గృహాలు మంజూరు చేసింది. నేడు ఈ కాలనీలో సుమారు 860 మంది ఓటర్లు ఉన్నారు. నాటి నుండి నేటికి 60 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ అదే విద్యుత్తు లైను ఇళ్ల మీద గుండా వెళ్తుంది. విద్యుత్ ఆయస్కాంత క్షేత్రం వలన కొంతమంది ప్రజలు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారని గ్రామస్తులు తెలిపారు. అంతేకాకుండా ఏ సమయంలో ఎటునుంచి ఏ ఉపద్రవం సంభవిస్తుందోనని భయాందోళనతో నివసిస్తున్నారు. ఈ సమస్యపై అనేకసార్లు జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకున్న దాఖలాలు లేవని ఆ గ్రామ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్తు లైను సుమారు మూడు కిలోమీటర్ల మేర గ్రామంలోని అన్ని వీధులలోని ఇళ్ళ మీద గుండా ఉన్నాయన్నారు. అధికారులు తమ సమస్యలను పట్టించుకోవడంలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జనావాసాలా మీద గుండా పోయే విద్యుత్ లైన్ ను మార్చాలి :- సర్పంచ్ దయామణి
జనావాసాలపై గల33/11 విద్యుత్ లైన్ ను మార్చి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని విద్యుత్ అధికారులను కోరారు. ఈ వైర్ల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మధిర ఎమ్మెల్యే ఎంఎల్ఏ మల్లు భట్టి విక్రమార్క, మంత్రి పువ్వాడ అజరు కుమార్ దృష్టికి మరలా తీసుకెళ్తామని తెలిపారు. సంయుక్త కృషితో సమస్యను పరిష్కరించాలని ఆమె కోరారు.