Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఖమ్మం నగరంలో పారిశుధ్య నిర్వహణ లోపాలను ఎత్తిచూపే దృశ్యాలు ఆదివారం సాయంత్రం కురిసిన వర్షంలో వెలుగుచూశాయి. సుమారు రూ.400 కోట్లతో నగరం సుందర రూపం సంతరించుకుందని చెప్పుకునే పాలకులను ప్రశ్నించే ఈ చిత్రాలు స్వయాన ఖమ్మం మేయర్ పునుకొల్లు నీరజ డివిజన్లో కనిపించాయి. ఖమ్మం నగరంలో ఆదివారం సాయంత్రం అరగంటకు పైగా కుండపోతగా వర్షం కురిసింది. ఈ వర్షానికి 20, 26వ డివిజన్లోని నాలాలు, మురుగు కాల్వలు ఉప్పొంగాయి. మురుగు నీరు రోడ్డెక్కింది. విజయలక్ష్మి ఆస్పత్రి నుంచి చర్చికాంపౌండ్ వరకు ఉన్న రోడ్డు మురుగు కాల్వను తలపించింది. రోడ్డుపై నడుం లోతు నీళ్లు చేరాయి. కార్లు, ఆటోలు నీళ్లలో కొట్టుకుపోయాయి. రోడ్డు దాటేందుకు పాదచారులు సైతం ఇబ్బంది పడ్డారు. వృద్ధులు యువకుల సహాయంతో రోడ్డు దాటారు. మారుమూల ప్రాంతాల్లో వరదలు సంభవించినప్పుడు కనిపించే దృశ్యాలు ఖమ్మం నగరంలో చోటుచేసుకోవడం చర్చనీయాంశమైంది. మేయర్ డివిజన్ 26తో పాటు టీఆర్ఎస్ కార్పొరేటర్ గోళ్ల చంద్రకళ ప్రాతినిధ్యం వహిస్తున్న 25 డివిజన్లో వర్షానికి మురుగునీరు రోడ్డెక్కిన వీడియోలను స్థానికులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ చేశారు. కమిషనర్, మేయర్, కార్పొరేటర్ ఈ డివిజన్ను సందర్శించి మురుగుకాల్వలో సిల్ట్ తొలగింపునకు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. నగరంలోని పాతబస్టాండ్, మయూరిసెంటర్, వైరారోడ్డులోనూ మురుగునీరు ఉప్పొంగి ప్రవహించింది. కార్లు, ఆటోల్లోకి నీరు చేరింది. దాదాపు నగరం మొత్తంమురికి నీటిమయం అయింది.