Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బోనకల్
నాటి అమర వీరుల త్యాగాల తోనే ప్రస్తుత పల్లెల అభివద్ధి అని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు జమ్ముల జితేందర్‌రెడ్డి అన్నారు. మండల పరిధిలోని
కలకోట,రాయపేట గ్రామాల్లో అమరజీవి తూము ప్రకాష్ రావు 39 వ వర్ధంతి వేడుకలను సిపిఐ గ్రామ కమిటీల ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. తొలుత కలకోట గ్రామం లో ప్రకాశరావు సహచరుడు యంగల రాములు స్థూపానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం తూము ప్రకాష్ రావు స్థూపానికి నివాళులర్పించారు. అనంతరం రాయన్నపేట గ్రామంలోని తూము ప్రకాష్ రావు భవన్ నందు ఉన్న తూము ప్రకాశరావు కాంస్య విగ్రహానికి బత్తినేని చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బత్తినేని నాగప్రసాద్ తో కలిసి నివాళులర్పించారు. అనంతరం సీపీఐ బోనకల్లు మండల కార్యదర్శి యంగల ఆనంద రావు అధ్యక్షతన జరిగిన తూము ప్రకాష్ రావు వర్ధంతి సభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ .. ప్రస్తుతం మధిర తాలూకా లోని పల్లెలు అభివృద్ధి చెందాయంటే ఆనాడు కమ్యూనిస్టు నాయకులు చేసిన త్యాగాలేనని ఆయన కొనియాడారు. గ్రామాల అభివృద్ధి కోసం ముఖ్యంగా దళితుల అభ్యున్నతి కోసం ఎందరో కమ్యూనిస్టు నాయకులు పోరాటాలు చేశారని, ఆ పోరాటాల కోసం తమ జీవితాలను త్యాగం చేశారన్నారు. కలకోట, రాయన్నపేట గ్రామాల అభివృద్ధి చెందడం కోసం, ఆ గ్రామాలలోని దళితులు అభివృద్ధి బాటలో నడవడానికి సమసమాజ రాజ్యం తేవడానికి తూము ప్రకాష్ రావు అమరుడైయ్యాడు అన్నారు. పోరాటం ఫలించడం సహించలేని పెత్తందారి వర్గాలు ప్రకాశరావుని దారుణంగా అంతమొందించాయన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా సమితి సభ్యులు బెజవాడ రవిబాబు, సీపీఐ మండల కార్యదర్శి వెంగళ ఆందనరావు, తోట రామాంజనేయులు, తూము రోషన్ కుమార్, ఏనుగు గాంధీ, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు మడుపల్లి లక్ష్మణ్, ఏఐఎస్ఎఫ్ జిల్లా జిల్లా సహాయ కార్యదర్శి టి అశోక్ సీనియర్ నాయకులు బొమ్మినేని హనుమంతరావు ,బొమ్మినేని కొండలరావు, జక్కా నాగభూషణం ,ఏనుగు పూర్ణచందర్రావు, కలకోట మత్స్య సహకార సంఘం అధ్యక్షులు బలుగుల అచ్చయ్య పాల్గొన్నారు.