Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భువనగిరి రూరల్
యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున హాజరై తమ సమస్యలను ఫిర్యాదుల రూపంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతికి అందజేశారు. కొత్త కలెక్టర్ పమేలా సత్పతి బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి సారి ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్నారు. కొత్త కలెక్టర్ రాకతో తమ సమస్యలు చెప్పుకోవడానికి చాలా మంది జిల్లాలోని పలు ప్రాంతాల నుండి కలెక్టరేట్ కార్యాలయానికి హాజరయ్యారు. దాదాపు 75కు పైగా అర్జీలు సోమవారం జరిగిన ప్రజావాణిలో అందాయని అధికారులు పేర్కొన్నారు. కరోనా తీవ్రత తగ్గడంతో భారీ సంఖ్యలో ప్రజలు హాజరు అయ్యారు. ప్రజా వాణి కార్యక్రమంలో భూ సమస్యల పైనే పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. అంతే కాకుండా మాజీ సైనికులు తమకు సరైన న్యాయం కావాలని, సైనికులుగా పనిచేసి పదవి విరమణ అనంతరం ప్రభుత్వ పరంగా అందాల్సిన సౌకర్యాలు అందడంలేదని, మాజీ సైనికులకు తగిన గుర్తింపును ఇవ్వాలని, ప్రభుత్వ పరంగా సహాయ సకరాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజావాణి కార్యక్రమంలో డీఆర్డీఓ ఉపేందర్ రెడ్డి, ఆర్డిఓ భూపాల్ రెడ్డి లు పాల్గొన్నారు.