Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు
నవతెలంగాణ- ఖమ్మం
ఆసియా సంస్కృతిని పెంపొందించేందు కోసం విశేషంగా కృషి చేసే వారికిచ్చే ప్రతిష్టాత్మకమైన ఫ్యుకోకా అవార్డు 2021 సంవత్సరానికి గాను ప్రముఖ జర్నలిస్ట్ పాలగుమ్మి సాయినాథు లభించిందని ఈ సందర్భంగా సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు పాలగుమ్మి సాయినాథ్కు అభినందనలు తెలిపారు. సాయినాథ్ అనేక సంవత్సరాలుగా గ్రామీణ భారతంలో వ్యవసాయం, సంస్కతి, యితర ప్రజా సమస్యలపై ఎన్నో పరిశోధనాత్మక వ్యాసాలు రాసారని వారు గుర్తు చేశారు. అట్టడుగు పేదలు ఎదుర్కొంటున్న సమస్యలను వెలికితీయడంలో సాయినాథ్ కృషి వెలకట్టలేనిదన్నారు. గతంలో ఈ అవార్డును ప్రముఖ చరిత్రకారులు రామి థాపర్ సహా మరో 11 మంది భారతీయులకు ఇచ్చారని అన్నారు. జర్నలిజం విభాగంలో 2007 సంవత్సరానికి గాను రామన్ మెగసెసే అవార్డు పొందారని, రామన్ మెగసెసే అవార్డు గ్రహీతగా కన్నా, ''పల్లె రిపోర్టర్'' అనే పేరుతో పిలవబడటానికే సాయినాథు ఎక్కువగా ఇష్టపడే మనస్తత్వం కలవారని అన్నారు. ప్రపంచంలోనే ఆకలి, కరువు విషయాలపై అత్యుత్తమ పరిశోధన చేసే జర్నలిస్టులలో సాయినాథ్ ఒకరని నోబెల్ గ్రహీత అమర్త్యాసేన్ కూడా ప్రశంసించారని గుర్తు చేశారు. సాయినాథ్ తెలుగువాడు కావడం మనందరికీ గర్వకారణమని అన్నారు. సాయినాథ్ మున్ముందు కూడా వ్యవసాయ రంగంలో ఇంకా ఎన్నో పరిశోధనలు చేసి, వ్యవసాయం రైతులకు లాభసాటి అయ్యే సూచనలు, సలహాలు ఇవ్వాలని అన్నారు.