Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) మండల కార్యదర్శి జాజిరి
- సిద్దారంలో మృతుల కుటుంబాలకు పరామర్శ
నవతెలంగాణ- సత్తుపల్లి
సిద్దారంలో కల్తీ మద్యం తాగి మృతిచెందిన వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి జాజిరి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. మంగళవారం శ్రీనివాసరావు సిద్దారం గ్రామంలో మృతుల కుటుంబాలను కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ గ్రామంలోని బీసీ కాలనీకి చెందిన రేపాని కేశవులు, డేరంగుల వీరయ్య, గుంజి శ్రీనులు మద్యం తాగగా వీరిలో కేశవులు, వీరయ్య మృతి చెందారని, శ్రీను తీవ్ర అస్వస్థతకు గురికావడం జరిగిందని శ్రీనివాసరావు తెలిపారు.గ్రామంలో పర్మిషన్ లేకుండా బెల్ట్షాఫులు విచ్ఛల విడిగా నిర్వహిస్తున్నారన్నారు. పక్కపక్క గ్రామాలైన సిద్దారం, గౌరిగూడెంలలో సుమారు 40 వరకు బెల్ట్‌షాపులు ఉన్నాయన్నారు. దళిత వర్గాలు, పేదలు మద్యానికి బానిసలై ఆరోగ్యాలను చెడగొట్టు కుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మద్యంతో అస్వస్థతకు గురై ఆసుపత్రుల పాలై ఆర్థికంగా అనేక కుటుంబాలు చితికి పోయాయన్నారు. ఎక్సైజ్ అధికారులు బెల్ట్‌షాపులు నిర్వహిస్తున్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఈ ఘటన నేపధ్యంలో ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి బెల్ట్‌షాపులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కల్తీ మద్యం తాగి మరణించిన కుటుంబాలకు రూ. 25లక్షల చొప్పున ఎక్స్‌గ్రేసియా అందించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) నాయకులు ఎలగం కృష్ణ, ఎలగం రాములు, రామకృష్ణ, గ్రామ పెద్దలు రేపాని లక్ష్మయ్య, రేపాని నరసింహారావు పాల్గొన్నారు.