Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో 100 మంది దళిత కుటుంబాలకు లబ్ది జరిగేలా ప్లాన్ చేసిన దళిత సాధికారత పథకంతో వారి జీవితాలు మారిపోతాయని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజరు అన్నారు. మంగళవారం ఆయన క్యాంప్ ఆఫీస్లో జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో కలిపి ప్రెస్మీట్ నిర్వహించారు. మంత్రి అజరు కుమార్ మాట్లాడుతూ ఈ ఏడాది బడ్జెట్లో రూ.1000 కోట్లు కేటాయించినా, దాన్ని రూ.1200 కోట్లకు పెంచి ఈ పథకాన్ని అమలు చేయడం సంతోషకరమన్నారు. జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకువస్తున్న ఈ పథకాన్ని దశలవారీగా అర్హులైన దళితులు అందరికీ వర్తించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం బాగుందన్నారు.
ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ దేశంలోనే దళితుల కోసం ఇలాంటి పథకాన్ని తీసుకువచ్చిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు. పార్టీలకు అతీతంగా అఖిలపక్షంలో అన్ని పార్టీల నేతలు ఈ పథకాన్ని స్వాగతించారని చెప్పారు. 18 శాతం ఉన్న దళితుల అభివృద్ధి జరగకుండా మిగిలిన సమాజం ముందుకుపోలేదన్న ఆలోచనతో ప్రభుత్వం ఈ పథకం తెచ్చిందన్నారు. లబ్దిదారుల ఎంపిక జరిగిన తర్వాత, వారికి ఎంచుకున్న యూనిట్లను సొంతంగా నడుపుకునే విధంగా వారికి ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ట్రైనింగ్ ఇస్తామని చెప్పారు.
కార్యక్రమంలో లింగాల రవికుమార్, కార్పొరేటర్ బుర్రి వెంకట్ పాల్గొన్నారు.