Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- బోనకల్
వ్యాక్సిన్ కోసం క్యూలో నిలబడిన జనం తోపులాటకు దిగడంతో ఎస్సై కొండలరావు రంగంలోకి దిగాడు. మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ప్రభుత్వం మొదటి వంద డోసుల వ్యాక్సిన్ సరఫరా చేసింది. కానీ మండల వ్యాప్తంగా సుమారు 300 మంది వ్యాక్సిన్ కోసం మంగళవారం ఉదయం ఐదు గంటలకే మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చేరుకున్నారు. గంటలకొద్దీ నిలబడలేక అందరూ చెప్పులు క్యూలో పెట్టారు. మండల వైద్యాధికారి సిబ్బంది 9 గంటలకు మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చారు. అప్పటికే మూడు వందల మంది కి పైగా క్యూలో నిలబడి ఒకరికొకరు క్యూలోనే నెట్టుకుంటున్నారు. గత నాలుగైదు రోజుల నుంచి వ్యాక్సిన్ కోసం భారీ సంఖ్యలో వస్తున్నారు. ప్రతిరోజు 100 వ్యాక్సిన్లు మాత్రమే ఉండడంతో మిగిలినవారు నిరాశ నిస్పహలతో వెళ్ళిపోతున్నారు. అంతకుముందు రోజు వ్యాక్సిన్ కోసం వచ్చిన వారు వ్యాక్సిన్ అయిపోవటంతో మరుసటి రోజు ఉదయం ఐదు గంటలకే మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వస్తున్నారు. ఈ విధంగా వ్యాక్సిన్ కోసం వచ్చిన వారిలో వ్యాక్సిన్ లేక సగం మందికి పైగా ఇంటికి వెళ్ళిపోతున్నారు. ఈ క్రమంలో మంగళవారం పెద్ద ఎత్తున జనం వ్యాక్సిన్ కోసం వచ్చారు. వ్యాక్సిన్ కోసం వచ్చి క్యూలో నిలబడిన వారికి మాత్రమే సిబ్బంది టోకెన్ ఇస్తున్నారు. ఈ టోకెన్ కోసం క్యూలో నిలబడిన జనం పెద్ద ఎత్తున ఒకరికి ఒకరు తోసుకుండటంతో పరిస్థితి చేయి దాటిపోవడంతో మండల వైద్యాధికారి, సిబ్బంది చేతులెత్తేసారు. పరిస్థితి చేయి దాటి పోవడంతో మండల వైద్యాధికారి ఎస్ఐ కొండలరావుకు సమాచారం అందిం చారు. దీంతో ఎస్ ఐ బి కొండలరావు తన సిబ్బందితో మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చేరుకున్నారు. ఎస్ఐ స్వయంగా రంగంలోకి దిగి క్యూలో నిలబడిన వారికి మాత్రమే టోకెన్ పంపిణీ చేశారు. టోకెన్ తీసుకున్న వారిని మరొకవైపు క్యూలో ఉంచి వ్యాక్సిన్ వేశారు. వ్యాక్సిన్ టోకెన్లు వంద మందికి పంపిణీ చేశారు. వంద టోకెన్లు పంపిణీ చేయగా మిగిలిన రెండు వందల మందికి పైగా అక్కడ నుండి పంపించివేశారు. దీంతో పరిస్థితి సుఖాంతమైంది. టోకెన్లు ఉన్నవారు క్యూలో నిలబడి ఇంజక్షన్ వేయించుకొని వెళ్లిపోయారు.
జనం ఎక్కువ - స్థలం తక్కువ
వ్యాక్సిన్ కోసం రోజు రోజుకి మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి జనం సంఖ్య పెరిగిపోతుందని కానీ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వచ్చిన జనానికి అనుగుణంగా స్థలం లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి విశాలంగా ఉన్న బోనకల్ ఉన్నత పాఠశాలలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మార్చాలని ప్రజా ప్రతినిధులు మండల ప్రజలు ఉన్నతాధికారులను కోరారు. జనం రద్దీని దష్టిలో పెట్టుకొని అందుకు అనుగుణమైన స్థలాన్ని ఎంపిక చేసి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించటం వల్ల ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు ఉండవని అన్నారు. వైద్య సిబ్బందికి కూడా ఇబ్బందులు లేకుండా తేలికగా ఇంజెక్షన్ కార్యక్రమం నిర్వహించవచ్చని ప్రజా ప్రతినిధులు అంటున్నారు.
డీఎంఅండ్హెచ్ఓ దృష్టికి వ్యాక్సిన్ కొరత
మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వస్తున్న జనానికి అనుగుణంగా వ్యాక్సిన్ సరఫరా లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మండల వైద్యాధికారి తాటికొండ శ్రీకాంత్ జిల్లా వైద్యాధికారి బి మాలతి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆమె స్పందించి సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి వ్యాక్సిన్ డోసుల పెంపు కోసం ప్రయత్నం చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. అదేవిధంగా మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్థలం సమస్య కూడా ఆమెకు వివరించారు.