Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెంలగాణ-కొత్తగూడెం
తాళం వేసి ఉన్న ఇండ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న దొంగని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ వెంకటేశ్వరబాబు తెలిపారు. మంగళవారం 1టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఉదయం కొత్తగూడెం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బస్ స్టాండ్ వద్ద సీఐ రాజు తన సిబ్బందితో వాహన తనిఖీలు చేస్తుండగా ఒక వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడు. అదుపులోకి తీసుకొని విచారించగా అతని పేరు వడ్డే విజరు కుమార్ అని, గౌతంపూర్ నివాసి తెలిపారు. అతనిని పూర్తి స్థాయిలో విచారించగా అతడు గత కొద్ది కాలంగా క్రికెట్ బెట్టింగులకు పాల్పడి అధిక మొత్తంలో నష్టపోయి అప్పుల పాలై, వాటిని తీర్చటానికి దొంగతనాలకు అలవాటుపడినట్టు డీఎస్పీ తెలిపారు. పట్టణంలో పలు ఇండ్లలో చోరీలకుపాల్పడినట్లు వివరాలు తెలిపారు. అతని వద్ద నుండి ఒక పానసోనిక్ టివీ, 13.5 తులాల బంగారు అభరణములను స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు. దొంగను పట్టుకున్న పోలీసుల సిబ్బందిని, సీఐని డీఎస్పీ అభినందించారు. ఈ విలేకర్ల సమావేశంలో వన్ టౌన్ సిఐ రాజు, 2 టౌన్ సిఐ సత్యనారాయణ, సిబ్బంది పాల్గొన్నారు.