Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గ్యాస్ బండలు ఎత్తుకొని ఐద్వా ఆధ్వర్యంలో నిరసన
- చర్యలు ఆపకపోతే ప్రజలే బుద్ధి చెబుతారు
- ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి
నవతెలంగాణ-ఇల్లందు
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గ్యాస్ ధరలు పెంచడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ గురువారం ఐద్వా ఆధ్వర్యంలో గ్యాస్ బండలు ఎత్తుకొని రోడ్డుపై నిరసన చేపట్టారు. పట్టణంలో నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మి, రాష్ట్ర అధ్యక్షురాలు ఆశాలత, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బత్తుల హైమావతి మాట్లాడుతూ.. బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు అనేక సార్లు గ్యాస్ సిలిండర్ ధరలు పెంచిందన్నారు. పేదలు మధ్య తరగతి కుటుంబాలు కరోనాతో ఉపాధి కోల్పోయి, ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని అన్నారు. ఈ సమయంలో సైతం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా ఇష్టానుసారం ధరలు పెంచుతూ ప్రజలను మరింత కష్టాల్లోకి నెట్టడం దారుణమన్నారు. దీనికితోడు పెట్రోల్, డీజిల్ రేట్లు నిత్యం పెంచుతూ పోవడం అత్యంత దారుణం అన్నారు. దీని మూలంగా ప్రజలు కొనుగోలు శక్తి కోల్పోయి ఆకలితో అలమటిస్తున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వ చర్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రంగా ఖండించాలని కోరారు. కేరళలోని వామపక్ష ప్రభుత్వం, తమిళనాడులోని స్టాలిన్ ప్రభుత్వాలు 16 రకాల నిత్యావసర వస్తువులు ఉచితంగా అందిస్తూ పేదలను ఆదుకుంటుందని అదే బాటలో టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ నడవాలని అన్నారు. రాష్ట్ర నాయకులు మాచర్ల భారతి, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మర్లపాటి రేణుక, ఎం.జ్యోతి, రాష్ట్ర కమిటీ సభ్యురాలు మెరుగు రమణ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఆలేటి సంధ్య, జైమున్నిసా,పాల్గొన్నారు.