Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమస్యలపై పాలకవర్గాలను నిలదీసిన గ్రామస్తులు
నవతెలంగాణ-చండ్రుగొండ
రాష్ట్ర వ్యాప్తంగా అట్టహాసంగా ప్రారంభమైన నాలుగో విడత పల్లె ప్రగతి ప్రణాళికలో భాగంగా గురువారం మండల వ్యాప్తంగా ఉన్న 14 గ్రామ పంచాయతీలలో గ్రామ సభలు నిర్వహించారు. ఈ గ్రామ సభలకు ప్రజలు భారీగా తరలి వచ్చి తమ సమస్యలను గ్రామ సభ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో కొంత మంది గ్రామస్తులు అధికారులతో ప్రజాప్రతినిధులతో వాగ్వివాదానికి దిగారు. చండ్రుగొండ గ్రామపంచాయతీ సర్పంచ్ మల్లిపెద్ది లక్ష్మీ భవాని ఉదయం 10 గంటలకు గ్రామసభ నిర్వహించాల్సి ఉండగా 12 గంటల సమయం అవుతున్న రాకపోవడంతో ఉప సర్పంచ్ దిబెందులు బాబురావు అధ్యక్షతన వహించి గ్రామసభను నిర్వహించారు. గ్రామ సభకు వచ్చిన కొంతమంది గ్రామస్తులు సర్పంచ్ సకాలంలో గ్రామ సభలకు రాకపోవడం ప్రజా సమస్యలు పట్టించుకోకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. బెండాలపాడు గ్రామంలో నిర్వహించిన గ్రామ సభలో గ్రామస్తులు తమ ఊర్లో కరోనా కేసులు ఎక్కువ సంఖ్యలో నమోదు అవుతున్నప్పటికీ అధికారులు తక్కువ చూపుతున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపల్లెవాడ గ్రామంలో నిర్వహించిన గ్రామ సభలో పంచాయతీ ట్రాక్టర్ ద్వారా ఇంటింటికి తిరిగి చెత్తను సేకరించాలి. అలాంటిది ఒక్కరోజు కూడా ఇంట్లో ఉన్న చెత్తను తీసుకెళ్లడం లేదని అలాంటప్పుడు డంపింగ్ షెడ్లు ఎందుకు నిర్మించారు. అంటూ అధికారులు పాలకవర్గంపై అసహనం వ్యక్తం చేశారు. గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులకు సంబంధించిన సమాచారం పంచాయతీ కార్యాలయంలో ఎందుకు పెట్టడం లేదని పంచాయతీ కార్యదర్శిని గ్రామస్తులు నిలదీశారు. గతంలో నాటిన మొక్కలను సైతం పట్టించుకోకపోవడంతో కొన్ని విరిగిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పంచాయతీ సిబ్బంది పాలకవర్గం సమస్యలపై దృష్టిసారించి సమస్యలు పరిష్కరించాలని కోరారు. వెంకటయ్య తండా లో జరిగిన గ్రామ సభలో గ్రామస్తులు గ్రామంలో సిసి రోడ్లు లేక వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అలాగే మిషన్ భగీరథ నీళ్లు సరిగా రావడం లేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తిప్పనపల్లి గ్రామంలో జరిగిన గ్రామసభలో డ్రింకింగ్ వాటర్ సమస్య, విద్యుత్ సమస్యలు తీవ్రంగా ఉన్నాయని గ్రామస్తులు గ్రామ సభ దృష్టికి తీసుకెళ్లారు. తుంగారం గ్రామంలో మిషన్ భగీరథ మంచినీళ్లు సకాలంలో రావడం లేదని అసలు నీటి సమస్యను ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడంలేదని గ్రామస్తులు గ్రామ సభలో తెలిపారు. ఈ గ్రామ సభలకు ఎంపీపీ బానోత్ పార్వతి, జెడ్పిటిసి కొడకండ్ల వెంకటరెడ్డి, జిల్లా కో ఆప్షన్ సభ్యులు ఎస్డి రసూల్, మండల స్పెషల్ ఆఫీసర్ సంజీవరావు, తహసీల్దార్ అండ్ సబ్ రిజిస్టర్ ఏం ఉష శారద, ఎంపీడీవో జి అన్నపూర్ణ, ఎంపీవో తోట తులసీరామ్ ఏపీఓ వెంకటేశ్వర్లు, మండల వ్యవసాయ శాఖ అధికారి చటర్జీ, విద్యుత్ శాఖ ఏఈ దేవా, ఆర్అండ్బి ఏఈ లక్ష్మణ్, ఐసీడీఎస్ సూపర్వైజర్ శకుంతల పాల్గొన్నారు.