Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పనులు చేయకుండానే నిధులు మాయం
- అవినీతిపై జిల్లా అధికారులు విచారణ నిర్వహించాలి
- గ్రామ సభకు అధికారులు గైర్హాజరు
- అవినీతిని సభలో బట్టబయలు చేసిన సీపీఐ(ఎం) మండల కార్యదర్శి సత్యనారాయణ
నవతెలంగాణ-కొత్తగూడెం
లక్ష్మీదేవిపల్లి మండలంలోని శ్రీనగర్ గ్రామ పంచాయతీలో అనేక అవినీతి కుంభకోణాలు జరిగాయని, జిల్లా కలెక్టర్, జిల్లా పంచాయతీ ఉన్నతాధికారులు సమగ్ర విచారణ నిర్వహించాలని, గ్రామ సభకు అధికారులు హాజరు కాలేదని, ప్రజా సమస్యలు మినిట్స్‌లో నోట్ చేయకుండ గ్రామ సభను జరిపిన తీరుపై జిల్లా కలెక్టర్, డీపీఓలు సమగ్ర విచారణ నిర్వహించాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి నల్లమల సత్యనారాయణ డిమాండ్ చేశారు. గురువారం ఉదయం నిర్వహించిన గ్రామ సభలో శ్రీనగర్ పంచాయితీలో జరిగిన అవినీతి అక్రమాలపై పాలకవర్గాన్ని నిలదీశారు. పాలకవర్గంలో రెండు సంవత్సరాలుగా అభివృద్ధి పేరుతో లక్షలాది రూపాయల కుంభకోణం జరిగిందని సమాచార హక్కు చట్టం ద్వారా తీసుకున్న నివేదిక ఆధారంగా బట్టబయలైందని తెలిపారు. లక్షలాది రూపాయల అవినీతి, అక్రమాలపై జిల్లా కలెక్టర్, జిల్లా పంచాయతీ అధికారి సమగ్ర విచారణ నిర్వహించాలని డిమాండ్ చేశారు. మట్టి దారి నిర్మాణం కోసం రూ.91,105లు ఖర్చుచేసినట్లు తీర్మాణాలు, ఎవరి పేరున బిల్లులు చెల్లించారో చెప్పాలన్నారు.సైడ్ డ్రైన్ నిర్మాణం పేరుతో రూ.81వేలు, బతుకమ్మ సంబురాలు కింద రూ.48,300లు, తీర్మాణాలు లేకుండానే మురికి కాలువల నుండి సిల్టు తొలగింపుకు రూ.3,82,370లు ఖర్చు చేశారని, కాంట్రాక్టర్ పేరు లేకుండానే నర్సరీ కాంపౌండ్ వాల్ నిర్మాణానికి రూ.2,57,856లు చెల్లింపులు చేశారని, బిల్లులు చూపకుండానే రూ.65 వేలకు ఫాగింగ్ మిషన్ కొనుగోలు చేశారని, ఏ పనిచేయకుండా, తీర్మాణం లేకుండా, మిస్ మ్యాచింగ్ ఎకౌంట్ నెంబర్ మీద రూ.4,36,196లు చెల్లింపులు చేశారని, పంచాయతీ పరిధిలో385 కోతులు పట్టించినందుకు గాను ఒక్కో కోతికి రూ.485 చొప్పున రూ.1,97,750లు పొంతనలేని చెల్లింపులు చేశారని ఆరోపించారు. ఇలాంటి అనేకం పనులు చేయకుండానే బిల్లులు డ్రా చేస్తున్నారని గ్రామ సభలో ఆరోపించారు. గత రెండేళ్లుగా లక్షలాది రూపాయలు అవినీతికి పాలకవర్గం పాల్పడిందని మండిపడ్డారు. పంచాయతీ పాలకవర్గం, కార్యదర్శి తీరు పట్ల తీవ్ర నిరసన తెలిపారు. అధికారులు గ్రామ సభకు హాజరుకాకపోవడ పట్ల నిరసన తెలుపుతూ ప్రజలు గ్రామ సభ నుంచి వెళ్లిపోయారు. ఈ గ్రామ సభలో శ్రీనగర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ పూనెం నాగేశ్వరరావు, ఉప సర్పంచ్ లగడపాటి రమేష్ చంద్ర, కార్యదర్శి కిరణ్ కుమార్, పాలక వర్గా సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు.