Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజరు
నవతెలంగాణ- ఖమ్మంప్రాంతీయ ప్రతినిధి
పరిశుభ్రత, పచ్చదనంతోనే పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరు కుమార్ తెలిపారు. నాల్గో విడత పట్టణ ప్రగతిలో భాగంగా గురువారం నగరంలోని 18, 19వ డివిజన్ శ్రీరామ్ నగర్, ముస్తఫానగర్, బోనకల్ రోడ్లలో కార్యక్రమాలకు మంత్రి హాజరయ్యారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని అమలు చేస్తున్న పట్టణ ప్రగతితో ఇప్పటికే గ్రామాల స్వరూపం మారిపోయిందన్నారు. పట్టణాలు ఇప్పుడే గాడిన పడుతున్నాయన్నారు. హరితహారం ద్వారా పచ్చదనంతో పాటు స్వచ్ఛమైన గాలి పీల్చవచ్చన్నారు. పల్లె, పట్టణ ప్రగతిలో భాగంగా ఖమ్మం కార్పొరేషన్ 18, 19వ డివిజన్ లో చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని రైతు బంధు సమితి రాష్ట్ర కన్వీనర్ పల్లా రాజేశ్వర రెడ్డి, జిల్లా కలెక్టర్ ఆర్ వీ కర్ణన్ తో కలిసి కాలువ పూడిక పనులు లాంఛనంగా ప్రారంభించారు. రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటారు. రోడ్లు, సైడ్ కాల్వలు, విద్యుత్ స్తంభాలు పరిశీలించారు. అసంపూర్తిగా ఉన్న పనులు చేపట్టాల్సిన పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పట్టణ ప్రగతితో డివిజన్లలో అన్ని పనులను చేసుకోవాలన్నారు. పారిశుద్ధ్యంపై ఎక్కువ దృష్టి సారించాలని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు పల్లెలు, పట్టణాల అభివద్ధి కోసం పట్టణ ప్రగతితో పాటు పచ్చదనం కోసం హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారన్నారు. పది రోజుల పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు కష్టపడి పనిచేస్తే నగరాలు శుభ్రంగా తయారవుతాయన్నారు. అదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్ష అని చెప్పారు. మిషన్ భగీరథతో ఇంటింటికి నల్లాల ద్వారా మంచి నీటి సరఫరా జరగాలన్నారు. వర్షాకాలంలో అన్ని డివిజన్లలో క్లోరినేషన్ జరపాలని, ఏవిధమైన వ్యాధులు ప్రబలకుండా తగు చర్యలు చేపట్టాలని అన్నారు. కాల్వలు శుభ్రం చేసే అధునాతన హైడ్రాలిక్ ట్రాక్టర్ను ప్రారంభించారు. కార్యక్రమంలో నగర మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజరు కుమార్, నగరపాలక సంస్థ కమిషనర్ అనురాగ్ జయంతి, ట్రైనీ కలెక్టర్ బి. రాహుల్, డిప్యూటీ మేయర్ పాతిమ జోహారా, డిప్యూటీ కమిషనర్ మల్లీశ్వరి, కార్పొరేటర్లు మందడపు లక్ష్మి, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.