Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీతరామ ప్రాజెక్ట్ నిర్మాణ బేస్ క్యాంప్ వద్ద రైతుల ఆందోళన
నవతెలంగాణ-చండ్రుగొండ
సీతారామ ప్రాజెక్టు కాలువ కట్ట నిర్మాణం వల్ల మూడు సంవత్సరాలుగా తమ పంటలు నీట మునుగు తున్నాయని ప్రాజెక్ట్ అధికారులు, కాంట్రాక్టర్లకు ఎన్నిసార్లు చెప్పినా ఎవరూ పట్టించుకోకపోవడంతో రైతులు ఆందోళన బాట పట్టారు. అందులో భాగంగా శుక్రవారం బెండాలపాడు గ్రామ శివారులో ఉన్న సీతారామ ప్రాజెక్టు బేస్ క్యాంపు వద్ద రైతులు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం సీతారామ ప్రాజెక్టు నిర్మాణానికి భూములు కావాలంటే చిన్న, సన్న కారు రైతులందరూ భూమి ఇచ్చామని మిగిలిన కొద్దిపాటి వ్యవసాయ భూముల్లో కూడా పంట సాగు చేసే పరిస్థితి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. సీతారామ కాలువ కట్ట నిర్మాణం చేపట్టడంతో పంట కాలువకు అడ్డుగా మట్టికట్ట అడ్డుగా వేయడంతో నీళ్లు ఎటూ వెళ్ళలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో గిరిజనులకు సంబంధించిన సుమారు 300 ఎకరాల సాగుభూమి ప్రశ్నార్థకంగా మారిందని రైతు ఆందోళన చెందుతున్నారు. తమ సమస్య పరిష్కారం చేయకుంటే రైతులందరూ కలిసి కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో చెరువు ఆయకట్టు మాజీ చైర్మన్ కారం సైదులు, పీసా కమిటీ చైర్మన్ వర్సు వీరభద్రు, గుంపెన సొసైటీ మాజీ వైస్ చైర్మన్ మేడా మోహన్ రావు, రైతులు పాల్గొన్నారు. ఇదే విషయాన్ని డివిజన్ ప్రాజెక్ట్ మేనేజర్ గోపి రాజు మీడియా వివరణ కోరగా డీఈ ఆదేశాల మేరకు పనులు నిర్వహిస్తున్నామని, రైతుల సమస్యని డీఈకి తెలియజేస్తామని అసంతృప్తి సమాధానం చెప్పారు.
రైతులు సమస్యను తన దృష్టికి తీసుకు వచ్చారని తహశీల్దార్ అండ్ సబ్ రిజిస్ట్రార్ ఏం.ఉషా శారద తెలిపారు. ప్రాజెక్టు సంబంధించిన వారితో మాట్లాడి సమస్య పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకుంటా మని రైతులు ఎవరూ అధైర్యపడవద్దు అన్నారు.