Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చోరీ కేసులో అనుమానితులపై బాధితురాలు ఫిర్యాదు
నవతెలంగాణ- బోనకల్
తనను ప్రతిరోజు దొంగతనం 'నీవే' చేశావంటూ వేధింపులకు గురి చేస్తుందని ఆ వేధింపులు తాళలేక తీవ్ర మనస్తాపంతో ఫిర్యాదిరాలి ఇంటిముందు పురుగుమందుతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన గార్లపాడులో శుక్రవారం చోటు చేసుకుంది. ఫిర్యాదిరాలు ఏటుకూరి శ్రీలక్ష్మి తెలిపిన వివరాల ప్రకారం.. గార్లపాడు గ్రామానికి చెందిన వరికూటి బుజ్జి 4 సంవత్సరాల నుంచి తన ఇంట్లో ఇంటి పనులు చేస్తుంది. ఈ క్రమంలో 2020 అక్టోబర్లో తన ఇంట్లో గల బంగారం వడ్రాణం, హారం అపహరణకు గురైనట్లు స్థానిక పోలీస్ స్టేషన్లో గత సంవత్సరం అక్టోబర్ 18న ఏడుగురిపై అనుమానితులుగా పేర్కొంటూ ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదులో వరికూటి బుజ్జితో పాటు వరికూటి నాగార్జున, కట్ల నాగేశ్వరావు, కట్ల చందు ,తడకమళ్ళ కృష్ణ, తడికమల్ల యశోద, తడకమళ్ళ మనోజ్లపై ఫిర్యాదు చేసింది. అనుమానితులను ఎస్ఐ పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చి విచారణ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన కనకపూడి సుధాకర్ శ్రీలక్ష్మికి ఇవ్వవలసిన డబ్బులను ఇచ్చేందుకు శ్రీలక్ష్మి ఇంటికి శుక్రవారం వెళ్ళాడు. ఇవ్వవలసిన డబ్బులు ఇచ్చి మరి కొంత డబ్బులు వడ్డీకి కావాలని సుధాకర్ అడిగాడు. దీంతో శ్రీలక్ష్మి తన ఇంట్లో చోరీకి గురైన బంగారాన్ని వరికూటి బుజ్జి తీసుకెళ్లి నాగేశ్వరరావుకి ఇచ్చిందని , ఆ డబ్బులతో నాగేశ్వరరావు పొలం కొన్నాడని, ముప్పై ఎకరాలకు పైగా వ్యవసాయం చేస్తున్నాడని ఇంత పెట్టుబడి కి నగదు ఎక్కడి నుంచి వచ్చిందని, ఎత్తుకెళ్లిన బంగారం లో నుంచి కొద్ది కొద్దిగా అమ్ముకుంటూ తన అవసరాలకు వాడుకుంటున్నాడని చెప్పింది. దీంతో సుధాకర్ నాగేశ్వరరావు దగ్గరకు వెళ్లి శ్రీలక్ష్మి చెప్పిన విషయాలన్నీ నాగేశ్వరరావుకు పూసగుచ్చినట్లు వివరించాడు. దీంతో తీవ్ర మనస్థాపంతో నాగేశ్వరరావు తాను దొంగతనం చేయకపోయినా పదేపదే దొంగతనం చేశాడని ప్రచారం చేస్తుందని పురుగు మందు డబ్బా తీసుకొని వెంటనే శ్రీలక్ష్మి ఇంటి ముందుకి వెళ్లి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించగా స్థానికులు అడ్డుకున్నారు. ఇది ఇలా ఉండగా నాగేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం వరికూటి బుజ్జి బంగారాన్ని శ్రీ లక్ష్మీ ఇంట్లో చోరీ చేసి తనకు ఇచ్చిందని పదే పదే గ్రామాల్లో ప్రచారం చేస్తూ తనపై కూడా ఫిర్యాదు చేసిందని తెలిపారు. పోలీసులు పిలిపించి తమను అనేకసార్లు విచారణ కూడా నిర్వహించారని, వారం రోజుల క్రితం కూడా మధిర సిఐ ఒడ్డేపల్లి మురళి మధిరకు పిలిపించి విచారణ నిర్వహించాలని తెలిపాడు. తాము దొంగతనం చేయలేదని స్పష్టం చేసినట్లు తెలిపాడు. ఇటీవల తాను ఇండిస్టియల్ కింద ట్రాక్టర్ లోన్ తీసుకున్నానని, పొలం కొన్నానని, 30 ఎకరాల వ్యవసాయానికి పెట్టుబడి ఎక్కడి నుంచి వచ్చిందని పదే పదే ప్రచారం చేస్తూ తనను దొంగగా చిత్రీకరణ చేస్తున్నట్లు తెలిపారు. గ్రామంలో తనను దొంగగా చూస్తున్నారని మనస్తాపం చెందుతున్నట్టు ఆవేదన వ్యక్తం చేశాడు. తనపై చేస్తున్న అబద్ధపు ప్రచారానికి మనస్తాపం చెంది ఆమె ఇంటి ముందే ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్లినట్లు తెలిపాడు. జరుగుతున్న విషయాన్ని శ్రీలక్ష్మి 100 కు ఫోన్ చేసింది. దీంతో బోనకల్ పోలీసులు రంగ ప్రవేశం చేసి పోలీస్ స్టేషన్ కు వారిని తీసుకెళ్లారు.