Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చర్ల
మండలంలోని మావోయిస్ట్ ప్రభావిత ఏజెన్సీ గ్రామాలైన కుర్నపల్లి, ఎర్రబోరు, బోధనెల్లి గ్రామాల్లో శుక్రవారం ఎస్పీ సునీల్ దత్ ఆదివాసీ గిరిజనులకు దోమ తెరలు, వాటర్ ఫిల్టర్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఓఎస్డీ తిరుపతి, భద్రాచలం ఏఎస్పీ డాక్టర్ వినీత్ జీ, చర్ల సర్కిల్ ఇనస్పెక్టర్ బి.అశోక్, ఎస్ఐ రాజువర్మలు పాల్గొన్నారు. ఎస్పీ సునీల్ దత్ చేతులు మీదుగా ప్రతీ కుటుంబానికి వాటర్ ఫిల్టర్లు, దోమ తెరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎస్పీ మాట్లాడారు. చర్ల పరిధిలోని అటవీ ప్రాంతంలో ఉన్న గిరిజనుల ఆరోగ్యం పట్ల పోలీసు శాఖ ప్రత్యేకమైన శ్రద్ధ చూపడం జరుగుతోందని అన్నారు. వర్షాకాలంలో వాగులలో ప్రవహించే నీటిని సేవించి ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించే పిల్లలు, పెద్దలు, వృద్ధులు, మహిళలు అనారోగ్య బారిన పడకుండా ఉండేందుకు స్వచ్చమైన నీటిని అందించేందుకు ప్రతీ కుటుంబానికి వాటర్ ఫిల్టర్‌తో పాటు, మలేరియా వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు దోమ తెరలు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ప్రత్యేక నిధుల నుంచి మండలంలోని ప్రతి గ్రామానికి రోడ్డు సౌకర్యం, అదేవిధంగా గ్రామాల్లో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణం చేపడతామని స్థానిక ప్రజలు అందుకు సహకరించాలని కోరారు.
ప్రభుత్వ శాఖల తరపున ఏజెన్సీ ప్రాంతాల్లోని ప్రజలకు ఏవైనా సౌకర్యాల కోసం స్థానిక పోలీసు అధికారుల ద్వారా తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. విద్యార్థుల ఆన్లైన్ క్లాసుల కోసం అవసరమైన టీవీలను, నెట్వర్క్ సౌకర్యాలను వీలైనంత త్వరలో కల్పిస్తామని, వాటికి అవసరమైన వివరాలను స్థానిక పోలీసు అధికారులకు తెలియజేయాలని కోరారు. ప్రస్తుత వ్యవసాయ సీజన్లో రైతులు విత్తనాలు, ఎరువులను కొనుగోలు చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అదే విధంగా మావోయిస్టు కుటుంబ సభ్యులు చొరవ తీసుకుని ఆజ్ఞాతంలో ఉన్న వారిని జనజీవన స్రవంతిలో కలిసి ప్రశాంత జీవనాన్ని గడిపే విధంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
అనంతరం ఓఎస్డీ తిరుపతి గారు మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో కరోనా వైరస్ సోకి ఇప్పటికే చాలా మంది మావోయిస్టులు మరణించారని తెలిపారు. వైరస్ సోకి బాధపడుతున్న మావోయిస్ట్ నాయకులు, సభ్యులు పోలీసు వారికి లొంగిపోతే వారికి ఎస్పీ నేతృత్వంలో మెరుగైన వైద్య చికిత్సలు అందించడానికి జిల్లా పోలీసు అధికారులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఏఎస్పీ డాక్టర్ వినీత్ జీ మాట్లాడారు. కలుషితమైన నీటిని సేవించరాదని తెలిపారు. ఏజెన్సీ గ్రామాల్లో ఎలాంటి సమస్యలు తలెత్తినా వెంటనే పోలీసు వారి దృష్టికి తీసుకురావాలని సూచించారు.