Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీసీఆర్ ఐసోలేషన్ కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తున్న ఫుడ్ కమిటీ నిర్వాహకులు
- 23 రోజులుగా కరోనా పేషెంట్లకు వంట చేస్తున్న ఐద్వా, సీపీఐ(ఎం) నాయకురాళ్ళు
- సేవా స్ఫూర్తితో నిర్విరామంగా 13 మంది సేవలు
నవతెలంగాణ-భద్రాచలం
భద్రాచలంలో బండారు చందర్రావు (బీసీఆర్) ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత ఐసోలేషన్ కేంద్రంలో కరోనా పేషెంట్లకు సకాలంలో అల్పాహారం, భోజనాలు ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు మెస్ కమిటీ నిర్వాహకులు. గత 23 రోజులుగా ఐసోలేషన్ కేంద్రంలోని కరోనా పేషెంట్లకు అవసరమైన పౌష్టికాహారంతో పాటు అల్పాహారాన్ని అందిస్తూ, భోజనాలను అందజేస్తూ, అన్నీ తామై.. అన్నింటిలో సహాయమై..ముఖ్యభూమిక పోషిస్తున్నారు ఐద్వా, సీపీఐ(ఎం) నాయకురాళ్ళు. బీసీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కేంద్రంలోని పేషెంట్లను ఆహారం అందజేయటం విషయంలో కంటికి రెప్పలా..సమయానికి టిఫిన్, భోజనం, పేషంట్స్‌కు అందజేయడంలో మెస్ కమిటీ నిర్వాహకులు శభాష్ అనిపించుకుంటున్నారు. ఇదిలా ఉండగా భద్రాచలం ఐసోలేషన్ కేంద్రంలో వంట పనులలో చురుకుగా పాల్గొంటూ సేవా భావంతో పనిచేస్తున్న ఐద్వా నాయకురాళ్ళను ఎమ్మెల్సీ నర్సిరెడ్డి ఇటీవల ఈ కేంద్రాన్ని సందర్శించినప్పుడు మహిళలను అభినందించారు. అదేవి ధంగా ఈ కేంద్రాన్ని సందర్శించిన సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ స భ్యులు బి.వెంకట్, యం.సాయిబాబు, పోతినేని సుదర్శన్‌రావు, రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా వెంకటేశ్వర్లు, ఏజే రమేష్, జిల్లా కార్యదర్శి అన్న వరపు కనకయ్యతో పాటు రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ సభ్యులు, నాయ కులు పలువురు ఈ మెస్ కమిటీ నిర్వాహకులను అభినందించారు.
ఇంటి పనులు చక్క బెట్టుకుని... సేవా కార్యక్రమాలలో....
భద్రాచలంలోని బండారు చందర్రావు ఉచిత ఐసోలేషన్ కేంద్రంలో మెస్ కమిటీలో కీలకంగా పని చేస్తున్న టువంటి ఐద్వా, సీపీఐ(ఎం) నాయకురాళ్ళు తమ ఇంటి పనులు చక్క బెట్టుకొన్న తర్వాత ఇక్కడ కేంద్రంలో ఈ సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. ఉదయం ఏడు గంటల లోపే మెస్ కమిటీలో కీలక పాత్ర పోషించి, వంట ఏర్పాట్లకు చేరుకుంటున్నారు. మరలా రాత్రి 8 గంటల తర్వాత వీరు తమ ఇండ్లకు వెళ్ళుతున్నారు.
అన్ని కమిటీలను దీటుగా..పేషెంట్లకు ఉండగా....
బండారు చందర్రావు ట్రస్టు ఆధ్వర్యంలో కోవిడ్-19 ఉచిత ఐసోలేషన్ కేంద్రం నిర్వహణకు సీపీఐ(ఎం) నాయకులు ఏర్పాటు చేసిన సబ్ కమిటీలలో మెస్ కమిటీ కీలకంగా మారిందని చెప్పవచ్చు. సబ్ కమిటీలలో రిజిస్ట్రేషన్ డిశ్చార్జ్ కమిటీ, మెడికల్ నర్సింగ్ స్టాఫ్ నిర్వహణ కమిటీ, పేషెంట్ బిల్లింగ్ మెయింట్ నెస్స్ కమిటీ, మెస్ కమిటీ, వాలంటిర్స్ కమిటీ, స్పాన్సరింగ్ కమిటీ, మీడియా కమిటీలు ఉన్నాయి. ఈ కమిటీలు ఉచిత ఐసోలేషన్ కేంద్రం విజయవంతంలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. ఇదిలా ఉండగా మెస్ కమిటీ కన్వీనర్‌గా ఐద్వా జిల్లా అధ్యక్షురాలు మర్లపాటి రేణుక ఆధ్వర్యంలో ఈ కేంద్రంలో ఉన్న పేషెంట్లకు భోజనాలు, అల్పాహారం అందజేస్తున్నారు. ఈ కేంద్రంలోని ఏడు కమిటీలలో ముఖ్య భూమికగా మెస్ కమిటీ నిర్వహణ జరుగుతుందని చెప్పవచ్చు.
నిర్విరామంగా సేవలందిస్తున్న 13 మంది...
మెస్ కమిటీ కన్వీనర్‌గా మర్లపాటి రేణుక నేతృత్వంలో ఐద్వా, సీపీఐ(ఎం) నాయకురాళ్ళు డి.సీతాలక్ష్మి, యన్.లీలావతి, యు.జ్యోతి, పి.రాజేశ్వరి ఆధ్వర్యంలో 13 మంది మహిళా నాయకురాళ్ళు, వాలంటరీలుగా స్వచ్ఛందంగా ఈ సేవా కార్యక్రమంలో 23 రోజులుగా నిర్విరామంగా తమ సేవలను అందిస్తున్నారు. మెయిన్ వంట మాస్టర్‌గా సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు అజ్మీరా హీరాలాల్, ప్రధాన హెల్పర్‌గా కే.కుమారితో పాటు ఐద్వా నాయకురాళ్ళు, వాలంటీర్లు ఈ పనుల్లో పూర్తిస్థాయిలో భాగస్వాములు అవుతున్నారు. ఉదయం ఏడు గంటలకు టీ, 8:30 గంటలకు బ్రేక్ ఫాస్ట్ (టిఫిన్), 10:30 గంటలకు రాగిజావ, మధ్యాహ్నం 12:30గంటలకు భోజనం, సాయంత్రం నాలు గు గంటలకు స్నాక్స్, రాత్రి 7 గంటలకు భోజనం అందిస్తున్నారు. అదేవి ధంగా ఘగర్ పేషెంట్ల విషయంలో డాక్టర్ల సలహా మేరకు తగిన మార్పులు చేసి ఆహారాన్ని అందిస్తున్నారు. అదేవిధంగా కరోనా పేషెం ట్లకు డ్రైఫ్రూట్స్ కూడా అందజేస్తున్నారు. ఈ సేవలు అందజేయడంలో భద్రాచలంలోని సీపీఐ(ఎం), ఐద్వా వార్డు కమిటీలలో రోజుకు ఇద్దరు చొప్పున మహిళలు ఈ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
కష్టకాలంలో కరోనా పేషెంట్లకు తోడుగా వుండాలి
బీసీఆర్ ట్రస్టు ఉచిత ఐసోలేషన్ కేంద్రంలో కరోనా పేషెంట్లకు కష్టకాలంలో తోడుగా ఉండాలని తాము సేవాభావంతో సీపీఐ(ఎం) ఆదేశాల మేరకు పని చేస్తున్నాము. 13 మంది కమిటీ సభ్యులుగా మెస్ కమిటీ నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తూ కరోనా పేషెంట్లకు పోషకాహారంతో పాటు భోజన ఏర్పాట్లు సకాలంలో అందజేస్తున్నాం. సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో భద్రాచలం కేంద్రంగా జరిగిన మహాసభలు, జిల్లా మహాసభలు, రాష్ట్ర మహాసభలు, జాతీయ మహాసభల్లో పాల్గొన్న నాయకులకు, కార్యకర్తలకు వంటలు చేసిన అనుభవంతో ఈ కేంద్రంలో విజయవంతంగా నిర్వహిస్తున్నాము. ఈ కేంద్రంలో ఉన్న కరోనా పేషెంట్లకు భోజనం ఏర్పాటు చేయడంతో పాటు, భద్రాచలంలో హెల్ప్‌లైన్ ద్వారా భోజన అవసరాలు కోరే కరోనా పేషెంట్లకు భోజనాలు తయారుచేసి ప్యాకెట్ల ద్వారా తయారు చేసి పంపిస్తున్నాం. ప్రతిరోజు సుమారు 50 భోజనం ప్యాకెట్లను బయట పేషెంట్లకు హెల్ప్‌లైన్ సెంటర్ ద్వారా అందజేస్తున్నాం.
- ఐద్వా జిల్లా అధ్యక్షురాలు, మెస్ కమిటీ కన్వీనర్ మర్లపాటి రేణుక